సేవ చేసేందుకే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌

– వైష్ణవీ ప్రసాద్‌
నవతెలంగాణ- ఎల్బీనగర్‌
అన్ని వర్గాల ప్రజలకు మరింత సేవ చేసేందుకు మల్కాజిగిరి పార్లమెంట్‌ నియాజకవర్గం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు పెండ్యాల శేషసాయి వరప్రసాద్‌ (వైష్ణవీ ప్రసాద్‌) వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియజకవర్గం ఎంపీ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేసేందుకు కొత్తపేట మారుతినగర్‌లోని భాగ్యనగర్‌ బ్రహ్మణ సమాజం భవనం నుంచి శుక్రవారం ర్యాలీగా బయలు దేరారు. మోహన్‌ నగర్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేట, న్యూనాగోలు, సమతపూరి కాలనీల మీదుగా ర్యాలీ కొనసాగింది. మల్కాజిగిరిలోని ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అభ్యర్థి వైష్ణవీ ప్రసాద్‌ నామినేషన్‌ పత్రాలను సమపర్పించారు. ఈ సందర్భంగా వైష్ణవీ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజల మనిషిగా, ప్రజల మధ్యలోకి అడుగులు వేస్తున్నానని ప్రజాపాలనతో, అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. ప్రజా సేవ చేయడానికి ముందుకు వస్తున్నానని స్పష్టం చేశారు. పేద ప్రజలకు మరింత మెరుగైన సేవే లక్ష్యంగా మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనను ఎంపీ గెలిపిస్తే నిరంతరం మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియాజకవర్గాల అభివద్ధి కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. అర్హులందరికీ ఉచిత విద్య, వైద్యం, ప్రతి అసెంబ్లీ నియాజకవర్గంలో ఆదర్శ ఆసుప్రతి, విద్యా సంస్ధలు ఏర్పాటుకు కషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల వినతుల స్వీకరణ, పరిష్కారానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యాలయం ఏర్పాటు చేస్తానని అన్నారు. సరికొత్త పరిశ్రమల స్థాపనకు రూపకల్పన యువతకు ఉపాధి అవకాశాలు, చెరువుల సంరక్షణ, సుందరీకరణ, కబ్జాల నుంచి చెరువులను కాపాడేందుకు నిరంతరం కషిచేస్తానని పేర్కొన్నారు. జవహర్‌నగర్‌లో ఉన్న వ్యర్ధాల గుట్టను తొలగించడానికి, కరిగించడానికి ప్రణాళిక అమలు చేస్తానని చెప్పారు. వాహనాల రద్దీ క్రమబద్దీకరణకు ప్రత్యేక ప్యూహం, నియాజకవర్గంలో పలు ప్రాంతాలకు మెట్రోరైల్‌ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మణ సంఘాల నాయకులు దుడ్డు సుబ్రహ్మణ్యం, జంటనరాల బ్రాహ్మణ సంఘాల సమైక్య పూర్వ అధ్యక్షులు వారణాసి వంశీ, వక్కలంక శ్రీనివాస్‌రావు, గొల్లపూడి రాజేశ్వరరావు, ప్రబల విశ్యానాథం, కైలాస్‌, కర్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.