ఎన్‌డీఏకు ఎదురుగాలి

ఎన్‌డీఏకు ఎదురుగాలి– తొలి విడత పోలింగ్‌లో సంకేతమిదేనన్న ఇండియా బ్లాక్‌
లక్నో: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఎదురుగాలి వీస్తోందని తొలి విడత పోలింగ్‌ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయని ఇండియా బ్లాక్‌ పేర్కొంది. బీజేపీ పతనానికి అమ్రోహలోని దోలఖ్‌ స్థానం నాంది పలకనుందని ఇండియా బ్లాక్‌లో ప్రధాన భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. బీఎస్పీ ఎంపీ, ప్రస్తుతం అమ్రోహలోని దోలక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానిష్‌ అలీకి మద్దతుగా ఆయన శుక్రవారం ఓ ర్యాలీనుద్దేశించి మాట్లాడారు. మోడీ పదేండ్ల పాలనపై యువత, రైతుల, సామాస్య ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. ఇదిలా వుండగా. తొలివిడత పోలింగ్‌ తీరు తెన్నులపై ఎన్నికల పరిశీలకుల విశ్లేషణలు కూడా దీనినే బలపరుస్తున్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో బీజేపీకి గతం కన్నా తగ్గవచ్చని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఈ నూట రెండు స్థానాల్లో బీజేపీ 62 సీట్లు గెలుచుకుంది. గతసారి పుల్వామాలో ఉగ్రవాద దాడిని ఉపయోగించుకుని దేశవ్యాపితంగా భాబోద్వేగాలను రెచ్చగొట్టింది. అంతకుముందు అంటే 2014 ఎన్నికల్లో ముజఫర్‌ నగర్‌ మత అల్లర్లపై బీజేపీ పెద్దయెత్తున తప్పుడు కథనాలను ప్రచారంలో పెట్టింది. హిందూ యువతులను ముస్లింలు ఎత్తుకుపోతున్నారంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టింది. ఈసారి అయోధ్యలో రామ మందిరాన్ని ముందుకు తెచ్చి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నించినా, అది అంతగా క్లిక్‌ కాలేదు. పైగా బీజేపీకి ఇంతవరకు మద్దతుగా ఉన్న జాట్‌ రైతులు దాని నుంచి దూరమవుతున్నారు. పంటలకు కనీసమద్దతు ధర (ఎంఎస్పీ) ఇస్తానని చెప్పి మోసగించడం, ఎంఎస్పీ కోసం ఉద్యమించిన పంజాబ్‌, హర్యానా రైతులపై తీవ్ర నిర్బంధం ప్రయోగించడం వంటి చర్యలతో బీజేపీ అభాసుపాలైంది. బీజేపీ అవినీతికి పరాకాష్టగా నిలిచిన ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వంటి చర్యలతో మోడీ గ్రాఫ్‌ మరింత పడిపోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతసారి రాజస్థాన్‌లోని మొత్తం 25 పార్లమెంటు స్థానాలను బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈసారి అక్కడ ఒక అంకెకు మాత్రమే పరిమితమవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.