మెదక్‌లో సీన్‌ మారేనా..!

Will the scene change in Medak..!– 25 ఏండ్లుగా కాంగ్రేసేతర పార్టీలదే హవా
– బోణీకొట్టేందుకు కాంగ్రెస్‌ వ్యూహ రచన
– 1980లో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం 1999 నుంచి గెలవని కాంగ్రెస్‌
– బీజేపీ ఒక సారి, బీఆర్‌ఎస్‌ ఐదు సార్లు గెలుపు
– మెదక్‌లో సీఎం వర్సెస్‌ మాజీ సీఎం
– స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్న ఇద్దరు నేతలు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పాతికేండ్లుగా కాంగ్రేసేతర పార్టీల హవానే నడుస్తోంది. ఒక సారి బీజేపీ, ఐదు సార్లు బీఆర్‌ఎస్‌ గెలిచాయి. అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీనే అధిక సార్లు గెలిచింది. 1980లో ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి ఎంపీగా గెలిచి దేశ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌, ఆలె నరేందర్‌, విజయశాంతి లాంటి ఉద్దండులు మెదక్‌ ఎంపీగా గెలిచారు. ఈ పాతికేండ్ల అపజయాల నుంచి బయటపడి గెెలిచి తీరాలన్న కసితో ప్రస్తుతం కాంగ్రెస్‌ ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక వ్యూహ రచన చేస్తూ ప్రజాదరణ ఉన్న బీసీ అభ్యర్థిని పోటీకి దించారు. తానే ఎన్నికల ప్లాన్‌ రచిస్తూ నేరుగా ప్రచార రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ సైతం డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం కేసీఆర్‌, హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగారు. మెతుకు సీమ ఓటర్ల తీర్పు ఎటువైపో వేచి చూడాలి. మెదక్‌ లోక్‌సభకు జరిగిన ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే.. పాతికేండ్లుగా ఇక్కడ కాంగ్రెస్‌ బోని కొట్టలేక పోయింది. అంతకు ముందు కాంగ్రెస్‌ గాలే వీచింది. గత నాలుగు సాధారణ ఎన్నికలతో పాటు ఒక ఉప ఎన్నిక జరుగగా వరుసగా బీఆర్‌ఎస్‌ గెలుస్తూ వచ్చింది. 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఆలె నరేంద్ర, 2009లో విజయశాంతి గెలిచారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేసీఆర్‌ మెదక్‌ పార్లమెంట్‌కు పోటీ చేసి గెలిచారు. కేసీఆర్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ కొత్త ప్రభాకర్‌రెడ్డి రెండో సారి ఎంపీ అయ్యారు. బీఆర్‌ఎస్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం మాజీ కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డిని పోటీకి దించింది. ఆయన మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బాగా పరిచయాలున్న వ్యక్తి కావడం, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండటంతో ప్రచారంలో ముందున్నారు. కేసీఆర్‌, హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ సారి కాంగ్రెస్‌ మెదక్‌లో ఖాతా తెరవాలని చూస్తోంది. మెదక్‌ పరిధిలో ఉన్న సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్‌, నర్సాపూర్‌, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అమలు చేసిన పథకాలపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. అభ్య్యర్థి నీలం మధు ముదిరాజ్‌ సామాజికత కూడా కలిసొస్తుందని భావిస్తోంది. రెండున్నర దశాబ్దాల నుంచి గెలవలేకపోయిన కాంగ్రెస్‌ ఈ సారి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కచ్చితంగా గెలిచి తీరాలన్నట్టు పనిచేస్తోంది. రేవంత్‌రెడ్డి తనదైన వ్యూహాలతో బీఆర్‌ఎస్‌, బీజేపీలను పక్కకు నెట్టి గెల్చుకుంటామని ధీమాలో ఉన్నారు. బీజేపీ కూడా పోటీ చేస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ మధ్యే పోటీ జరగనుంది.
సీఎం వర్సెస్‌ మాజీ సీఎం
మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య పోటీ కంటే సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్‌ మాజీ సీఎం కేసీఆర్‌ అన్నట్లుగా కనిపిస్త్తోంది. వ్యూహ ప్రతివ్యూహాలతో రాటుదేలిన ఆ ఇద్దరూ మెదక్‌ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసీఆర్‌ సొంత ఇలాకైన మెదక్‌ పార్లమెంట్‌ స్థానాన్ని గెల్చుకునేందుకు గులాబీ దళపతి రంగంలోకి దిగారు. మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పడమే కాకుండా తాను సైతం ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నారు. ఈ నెల 16న అందరి కంటే ముందే మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంచనాలకు మించి జనాలు సభకు హాజరుకావడంతో క్యాడర్‌లో జోష్‌ను పెంచేలా కేసీఆర్‌ ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. లిల్లీపుట్‌గాళ్లంటూ హేళన చేశారు. కరెంట్‌ కోతలు, ఎండిన పంటలు, వడ్ల కొనుగోలు వంటి అంశాలను ఎన్నికల ఎజెండా చేయగలి గారు. మరో పక్క కేసీఆర్‌ను ఢ కొనేలా సీఎం రేవంత్‌రెడ్డి సైతం మెదక్‌లో దూకుడు పెంచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ కార్యక్రమానికి ఈ నెల 20న రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ర్యాలీ, సభలో పాల్గొని కేసీఆర్‌, హరీశ్‌రావు వైఫల్యాన్ని ఎండగట్టారు. మంత్రి కొండా సురేఖను నియోజకవర్గ ఇన్‌చార్జిగా పెట్టి మైనంపల్లి హనుమంతరావుకు సిద్దిపేట బాధ్యతలు అప్పజెప్పారు. కేసీఆర్‌, హరీశ్‌రావు ఎత్తులను చిత్తు చేసేలా పావులు కదుపుతున్నారు. మెదక్‌లో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ ఇద్దరూ అభ్యర్థుల కంటే ఎక్కువగా పట్టించుకోవడం విశేషం.
ఆరుగురు ఎమ్మెల్యేలు.. ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు
మెదక్‌ పరిధిలో ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుండటంతో బీఆర్‌ఎస్‌లో ధీమా కనిపిస్త్తోంది. ఎమ్మెల్యేల బలంతో పాటు ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన హరీశ్‌రావు, రాజకీయ చతురత కల్గిన కేసీఆర్‌ ఇద్దరిదీ మెదక్‌ పార్లమెంట్‌ సొంత ఇలాకా కావడంతో క్యాడర్‌లో జోష్‌ పెరిగింది.పైగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల కంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే రెండు లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. అంటే రెండు లక్షల ఓట్ల అదనపు బలంగా బీఆర్‌ఎస్‌ భావిస్తుంది.
ఆరు గ్యారంటీలే కాంగ్రెస్‌ బలం
సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాటజీ, మంత్రుల ప్లానింగ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారంటీలే కాంగ్రెస్‌కు బలంగా కనిపిస్తున్నాయి. ఉచిత బస్‌ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, రైతు భరోసా, ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచడం వంటి పథకాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. ఆగస్టు 15 లోపు రూ. రెండు లక్షల రుణమాఫీ, ఖరీఫ్‌ నుంచి బోనస్‌ అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి ప్రకటన కూడా రైతాంగంలో సానుకూలత తెస్తుందని అనుకుంటున్నారు.
కాగా, ముదిరాజ్‌ ఓట్లు అధికంగా ఉన్న మెదక్‌లో నీలం మధుకు కలిసొస్తుందో లేదో చూడాలి.