హెచ్‌సీయూలో ఏబీవీపీ మూకదాడులు ఆపాలి

ABVP mob attacks in HCU should be stopped– దోషులను శిక్షించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిట (హెచ్‌సీయూ)లో గత వారం రోజులుగా ఏబీవీపీ నాయకత్వంలో మూకదాడులు చేస్తున్నారనీ, విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏడుగురు విద్యార్థినులతో సహా, 20 మంది విద్యార్థులు వీరి దాడిలో గాయపడ్డారని తెలిపారు. ఇద్దరు విద్యార్థినులతో సహా ఆరుగురు ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల వాతావరణంలో సున్నితమైన అంశాలను ముందుకుతెచ్చి, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నంలో ఒక పథకం ప్రకారమే దాడులు చేస్తున్నారని తెలిపారు. ఈ దాడులను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తక్షణం విచారణ జరిపి దోషులను శిక్షించాలనీ, విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.
ఈనెల 13న జరిగిన వీడ్కోలు వేడుకల్లో ఏబీవీపీ కార్యకర్తలు వికలాంగుడైన హర్షరాజ్‌పై దాడి చేయటంతో, ఎస్‌ఎఫ్‌ఐ ఇతర సంఘాల నాయకులు సర్దుబాటుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అనంతరం 17న ఒక పథకం ప్రకారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త ఫైజల్‌పై దాడి చేసి విద్యార్థులను గాయపరిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా, దాన్ని కూడా ఈ మూక అడ్డుకున్నదని తెలిపారు.
అమ్మాయిలను లైంగికంగా వేధించారనే విషయం వీడియోల్లో స్పష్టంగా కనబడుతోందని పేర్కొన్నారు. సమస్యను లోతుగా విచారణ జరపకుండా పోలీసు అధికారులు దీన్ని రెండు విద్యార్ధి సంఘాల మధ్య ఘర్షణగా చూడటమేంటని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం యూనివర్సిటీ లో ఘటనను వాడుకునేందుకే ఏబీవీపీ ఒక పథకం ప్రకారం చిచ్చుపెడుతున్నదని తెలిపారు. గాయపడినవారినీ, దాడి జరగకుండా నివారించే ప్రయత్నం చేసిన వారిని కూడా కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని పేర్కొన్నారు. దాడికి గురైన బాధితులను బైండోవర్‌ చేస్తున్నారనీ, పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. పోలీసు అధికారులు వాస్తవాలు గమనించి, బాధితులను వేధించటాన్ని ఆపాలనీ, దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితులపై బైండోవర్‌ కేసులు ఎత్తి వేయాలనీ, వేధింపులు ఆపాలనీ విజ్ఞప్తి చేశారు.