– అది భావానికి సంబంధించిన అంశం
– మూఢత్వంలోకి నడిపిస్తున్న శక్తుల్ని నిలవరించాలి : ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్
– అన్యాయం స్థిర కాలం రాజ్యమేలదు
– మోడీ కూడా అంతే.. : కవి శివారెడ్డి
– జయప్రదంగా కవి గాయక సమూహగానం
‘అహంకారం తలకెత్తుకున్నాక ఈ దేశం మా సొత్తు అనే పొగరు ఎవరి కాలును నేల మీద నిలవనీయడం లేదు చూస్తుండగానే దేశం మధ్యయుగం బాట పట్టింది’
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫాసిజమనేది క్యాన్సర్లాంటిదనీ, అది క్రమంగా కొంచెం కొంచెంగా విస్తరిస్తుందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఒకటో దశ, రెండో దశ ఇలా దశలవారీగా ఉంటుందనీ, ఒక్కో సారి నాలుగో దశవరకు దాని ప్రభావం తెలీదని ఆయన చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యతన ‘ప్రజాస్వామిక, లౌకిక, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కలం, గళం ఎత్తుదాం’ అనే అంశంపై కవి గాయక సమూహగానం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వంద మందికిపైగా కవులు, రచయితలు, గాయకులు హాజరయ్యారు. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు 12 సెషన్లుగా కార్యక్రమం నడిచింది. ‘ ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, విజృంభించే అవకాశమున్న మనువాదం, దానికి అత్యంత బాధితులుగా ఉన్న దళితులు, స్త్రీలు, మైనారీటీలు, ఆదివాసీలు, బీసీలు, సెక్యులరిజం-రాజ్యాంగ రక్షణ, మత సామరస్యం వంటి ఎన్నో అంశాలమీద కవితా గానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామిక, లౌకిక, రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాలని ఆలోచించటమే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రత్యేకతన్నారు. వాస్తవంగా రాజ్యాంగం, లౌకిక విలువలు, మనువాదం, ఫాసిజం తదితర మాటలు సృజనాత్మక సాహిత్యంలో అంతగా ఇమిడేవి కావన్నారు. కవిత్వం తన స్వభావం కాని అనేక విషయాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సొస్తుందనీ, సృజించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పుడు ఫాసిజం, నియంతృత్వం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలిపారు.
ఫాసిజమనేది ఎక్కడో బయట ఉండదన్నారు. ‘దాన్ని రాకుండా చేయాలి. దాన్ని ఖండించాలి. దాన్ని చంపాలి. తరిమేయాలి’ అనే నినాదాలిస్తాం. కానీ..అదో దుర్మార్గమైన చట్టం కాదు, ఒక సంఘటన కాదని చెప్పారు. ఇది ఒక దుర్మార్గపు భావాజాలమనే విషయాన్ని అందరూ గుర్తించాలని సూచించారు.
దాన్ని ఎదుర్కోవటమెలా? అని ఆలోసించాలని కోరారు. అది డౌన్ డౌన్ అంటే పోయేది కాదని చెప్పారు. అదోక ప్రక్రియ అన్నారు. కొంచెం కొంచెంగా క్రమంగా వస్తుందన్నారు.
దీన్ని భావాజాల పరంగానే ఎదుర్కోవాలని సూచించారు. ప్రముఖ కవి శివారెడ్డి మాట్లాడుతూ అన్యాయం స్థిర కాలం రాజ్యమేలదన్నారు. అదే తరహాలో మోడీ కూడా ఎల్ల కాలం ఉండలేడన్నారు. పసునూరి రవీంద్ర మాట్లాడుతూ ‘దేశం ఇప్పుడు చెరబడ్డ పక్షి’ అనే శీర్షికతో కూడిన కవిత ద్వారా కవిగాయక సమూహగానాన్ని ప్రారంభించారు.అంటూ దేశంలో కొనసాగుతున్న దుర్మార్గాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. 400 సీట్లిస్తే..రాజ్యాంగాన్ని మారుస్తామంటే..మేం పాలకులనే మారుస్తామంటూ బాధితుల పక్షాన నిలబడాల్సిన సందర్భం వచ్చిందన్నారు. మనువాదం భరత మాత బట్టలిప్పేందుకు జాగ్రత్తగా కుట్ర చేస్తున్నదని హెచ్చరించారు. మూఢత్వం, మూర్ఖత్వంతో దేశాన్ని నడిపిస్తూ వెనక్కి తీసుకుపోతున్న నేటి తరుణంలో కవులు, రచయితలు సమూహ శక్తులుగా మారాల్సిన అవసర ముందని నొక్కి చెప్పారు.