ప్రశాంతి నగర్‌లో భూ దందా…ప్రభుత్వ భూముకే ఎసరు…!

– అధికారులకు స్థానికుల ఫిర్యాదు
– చర్యలు తప్పవని అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు
నవతెలంగాణ-కొత్తగూడెం
భూ కబ్జాదారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం వేదికగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏకంగా ప్రభుత్వ భూమికి ఎసర పెడుతున్నారు. స్థానికంగా ఉన్న నాయకుల అండదండలతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గిరిజన చట్టాలను సైతం తుంగలో తొక్కి భూ కబ్జాలు చేస్తున్నారని తెలుస్తున్నది. అధికారుల హెచ్చరించినప్పటికీ కబ్జా దారులు పెడ చేవిన పెడుతున్నారు. చుంచుపల్లి మండలం ప్రశాంతి నగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాళీ ప్రభుత్వ భూములపై కొందరు కన్నేశారు. దర్జాగా కబ్జాకి కాలు దువ్వారు. స్థానికేతరులైన కబ్జాదారులు రాజకీయ నాయకులు అండదండలతో ప్రశాంతి నగర్‌ పంచాయతీ ఏరియాలోని సింగరేణి సోలార్‌ ప్లాంట్‌ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు చర్యలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. కబ్జా చేసిన భూమి దర్జాగా చదును చేసి కబ్జా చేస్తున్న తీరును స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పంచాయతీ అధికారి వెంటనే స్పందించి చదును చేసిన ప్రాంతంలో ”ఇది ప్రభుత్వ భూమి..” అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇల్లందు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడికి వచ్చి భూకబ్జాను ఎలా చేస్తున్నాడంటూ చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయల విలువ చేస్తే ప్రభుత్వ భూమిపై ఇల్లందు భూ కబ్జా దారుడు కన్ను వేయడం పట్ల స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఒక మహిళ ఈ భూమి పక్కనే ఉన్న కొంత స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడితే సింగరేణి ఎస్టేట్‌ అధికారులు కూల్చివేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ, సింగరేణి భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేస్తేనే ఆక్రమణలు చేసే అవకాశం ఉండదని సింగరేణి కార్మికులు అధికారులకు సూచిస్తున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుని ఖాళీ భూముల చుట్టూ రక్షణ ఫెన్సింగ్‌ వేసి సింగరేణి భూములను కాపాడి, ప్రజల అవసరాల నిమిత్తం ఆ భూముల్లో కమ్యూనిటీ హాల్స్‌ను ఏర్పాటు చేసినట్లయితే ఎంతో ప్రయోజనం ఉంటుందని సింగరేణి కార్మికులు, స్థానికులు కోరుతున్నారు.