– బీజేపీ, టీఎంసీ మతతత్వ ఎజెండా
– ప్రజల జీవితాన్ని హత్తుకునే అంశాలపై వామపక్ష కూటమి ప్రచారం
– సంక్షోభంలో లక్షలాది కుటుంబాలు
– జె.జగదీష్, నవతెలంగాణ
ఉత్తర బెంగాల్‌లో తొలి రెండు దశల పోలింగ్‌లో తేయాకు తోటల క్షీణత, కార్మిక కుటుంబాల దుస్థితిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, తృణమూల్ ప్రభుత్వ వైఖరి లక్షలాది కుటుంబాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. అలీపుర్దార్, జల్పాయి గుడి, కూచ్ బీహార్, డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గాలలోని జనాభాలో సగానికి పైగా ప్రజలు తేయాకు తోటల రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ తేయాకు తోటలపై సరళీకరణ విధానాల నీడ గత పదేండ్లలో అపారంగా పెరిగింది. దీంతో కార్మిక కుటుంబాల దుస్థితి ఎన్నికల్లో ప్రతిబింబించకుండా ఉండేందుకు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు మతతత్వాన్ని, మతతత్వ భావాలను వ్యాప్తి చేస్తున్నాయి. మరోపక్క వామపక్ష కూటమి ప్రజల జీవితాలను హత్తుకునే అంశాలపై ప్రచారం చేస్తోంది.
ఆల్ ఇండియా ప్లాంటేషన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి జియావుల్ ఆలం మాట్లాడుతూ 1953 టీఈ చట్టాన్ని బీజేపీ రద్దు చేయడంతో టీ మార్కెటింగ్, నియంత్రణ వ్యవస్థలో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ‘ టీ ఉత్పత్తి, నాణ్యత, వేలం, ఎగుమతి, దిగుమతులు, ధరల స్థిరత్వంపై ఎటువంటి నియంత్రణ లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థల తోటలు కూడా క్షీణించాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రసిద్ధ డార్జిలింగ్ టీ ఉత్పత్తి సగానికి పడిపోయింది.’.. అని తెలిపారు.
కనీస వేతనం పునరుద్ధరణకు ఇష్టపడకపోవడంతో కార్మికులు ఇతర ఉద్యోగాలు వెతుక్కుంటూ వలస వెళ్లాల్సి వస్తుంది. బెంగాల్, బీజేపీ పాలిత అస్సాంలో కనీస వేతనం రూ.250 ఉంది. కేంద్రం డిజిటల్ ఇండియా ప్రకటన ప్రకారం ఈ ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలు అందలేదని జియావుల్ ఆలం చెప్పారు. బెంగాల్‌లోని తేయాకు తోటలకు కేంద్ర విధానాల వల్ల చాలా నష్టం కలిగింది.
డార్జిలింగ్ మినహా మిగిలిన మూడు నియోజక వర్గాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. అడవులపై ఆధారపడి జీవించే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అటవీ పరిరక్షణ చట్టం, అటవీ ఖనిజాల వినియోగ చట్టంలో కేంద్రం చేసిన సవరణలు పర్యావరణ సమతుల్యతకు, గిరిజనుల జీవనోపాధికి విఘాతం కలిగిస్తున్నాయి. అటవీ ఆక్రమణలను, దోపిడీలను ప్రోత్సహించే ఈ విధానాలను ఎన్నికల సమయంలోనూ ప్రయోగిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలు క్షీణతను ఎదుర్కొంటు న్నాయి. పాఠశాల, కళాశాల స్థాయిల్లో డ్రాపౌవుట్లు కొనసాగుతున్నాయి.