ఓయూ ఫండ్స్‌ స్వాహా కేసులో ఆరుగురికి ఊరట

ఓయూ ఫండ్స్‌ స్వాహా కేసులో ఆరుగురికి ఊరటనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన రూ.1.18 కోట్లను దుర్వినియోగంపై 1993 నాటి కేసులో ఆరుగురు సిబ్బందికి హైకోర్టు తీర్పు ద్వారా ఊరట లభించింది. వారికి జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి బ్యాంక్‌ సిబ్బందిని ఒక్కరిని కూడా విచారించలేదనీ, ప్రాసిక్యూషన్‌ ప్రవేశపెట్టిన సాక్ష్యం నిందితుడి నేరాన్ని నిరూపించేలా ఉండాలని తెలిపింది. వేరే ఉద్యోగులతో కలసి డైరెక్టర్‌ గోపాలన్‌ ప్రింటింగ్‌ మెటీరియల్‌ కొనుగోలు వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందని వర్సిటీ రిజిస్ట్రార్‌ 1993లో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రూ.1.18 కోట్ల విలువ చేసే ప్రింటింగ్‌ సామగ్రి, స్టేషనరీ కొనుగోలు అక్రమాల కేసులో ఏసీబీ 11 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. ప్రింటింగ్‌ ప్రెస్‌ చీఫ్‌ ప్రాసెస్‌ ఆపరేటర్‌ బాలమల్లేశ్వర్‌రావు, కంపోసిటర్‌ జి.చంద్రశేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సయ్యద్‌ అన్వర్‌, జి.దామోదర్‌, మిషన్‌ మ్యాన్‌ కె.ఎల్‌. రామారావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.సత్యనారాయణలకు ఏసీబీ కోర్టు 2007లో శిక్ష విధించింది. దీనిని వాళ్లంతా హైకోర్టులో సవాల్‌ చేయడంతో ఏసీబీ కోర్టు తీర్పును రద్దు చేస్తూ జస్టిస్‌ కె.సురేందర్‌ తీర్పు చెప్పారు.