ఆ సమాచారం అందుబాటులో లేదు

– రాష్ట్రపతి భవన్‌
న్యూఢిల్లీ : ఏ ఫైల్స్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పున:పరిశీలన కోసం తిరిగి పంపారనే సమాచారం అందుబాటులో లేదని రాష్ట్రపతి భవన్‌ మంగళవారం ఆర్‌టిఐ ప్రశ్నకి సమాధానమిచ్చింది. సమాచార హక్కు చట్టం, 2005 కింద తమిళనాడుకి చెందిన రాజ్‌ కపిల్‌ ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాని, కేబినెట్‌, కేబినెట్‌ నియామకాల కమిటీ (ఎసిసి), పార్లమెంట్‌, కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ఏజన్సీలు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ఎన్నిసార్లు తిరిగి పంపారో తెలియజేయాలని పిటిషన్‌లో కోరారు.
రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి తిరిగి సమీక్షించాలని ఎన్నిసార్లు తిప్పిపంపారో కూడా తెలియజేయాలని కోరారు. అటువంటి సమాచారం అందుబాటులో లేదని రాష్ట్రపతి భవన్‌ డైరెక్టర్‌ శివేంద్ర చతుర్వేది సమాధానమిచ్చారు. గతంలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ప్రధాని, కేబినెట్‌ నిర్ణయాలను ఎన్నిసార్లు పున:పరిశీలన కోసం పంపించారని దాఖలైన పిటిషన్‌కు రాష్ట్రపతి భవనన్‌ ఇదే విధమైన సమాధానమివ్వడం గమనార్హం.