ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పై ఈసీ వేటు

– విజయవాడ పోలీస్‌ కమిషనర్‌పై కూడా
– తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశం
అమరావతి : ఏపీలో ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతున్న వేళ ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పిఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై బదిలీ వేటు వేసింది. ఆయనతో పాటు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాను కూడా బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని తక్షణమే బదిలీ చేయడంతో పాటు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వీరి స్దానాల్లో కొత్త వారి నియామకం కోసం గత ఐదేండ్లలో ఎటువంటి విజిలెన్స్‌ కేసులు లేని ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను ఒక్కో పోస్టుకు నేటి (బుధవారం) మధ్యాహ్నాం 3గంటల్లోగా పంపాలని ఉత్తర్వులలో పేర్కొంది. బదిలీ అయిన అధికారులు విధుల నుంచి తప్పుకునే సమయంలో తమ దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటికే గుంటూరు ఐజి పాలరాజుతో పాటు పరమేశ్వరరెడ్డి( ఒంగోలు), వై,రవి శంకర్‌రెడ్డి( పల్నాడు), పి.జాఘవా( చిత్తూరు), కెకె అన్బురాజన్‌ (అనంతపురం), కె.తిరుమలేశ్వర్‌(నెల్లూరు) ఎస్పీలపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. వారితో ముగ్గురు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను కూడా ఈసీ బదిలీ చేసింది.
వేటు ఎందుకంటే…?
గత నెలలో ప్రధాని చిలకలూరిపేట వద్ద పాల్గొన్న బహిరంగ సభలో భద్రతా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందడం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పై వేటుకు ప్రధాన కారణమని సమాచారం. ఈ విషయమై బీజేపీతో పాటు టీడీపీ,జనసేనలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. అంతే కాకుండా ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడం, ఇంటెలిజెన్సీ చీఫ్‌గా కొనసాగితే మే 13 న జరుగునున్న సాధారణ ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశాలు ఉండవని ఎన్డీఏ కూటమి కేంద్ర ఎన్నికల సంఘానికి వరుస పిర్యాదుల చేసిన నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు. విజయవాడ సీపీ కాంతిరాణాటాటాపై వేటు విషయానికి వస్తే ఈనెల 16న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర విజయవాడలో జరిగిన నేపధ్యంలో సింగ్‌నగర్‌లో సీఎంపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో సెక్యూరిటీకి స ంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ఆయన వైఫల్యంం చెందారని కేంద్ర ఎన్నికల సంఘం భావించినట్లు సమాచారం. దీంతో పాటు ఆయన అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.