– ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మంగళవారం మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. రాష్ట్రంలో కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలలో ఎక్కువ భాగం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. అద్దెలు చెల్లించలేకపోవడంతో డిస్పెన్సరీలు మూతపడుతున్నాయని, వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. కొన్ని నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానులు బలవంతంగా తాళాలు వేసి మూసేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే మిర్యాలగూడ, బీబీనగర్, మేడ్చల్, బొల్లారం, షామీర్‌పేట్ డిస్పెన్సరీలు మూతపడ్డాయన్నారు. మరికొన్ని డిస్పెన్సరీలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. డిస్పెన్సరీలు మూతపడటంతో కార్మికుల వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీల భవనాల అద్దెల చెల్లింపులు రూ.2 కోట్లా 10 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. వెంటనే నిధులు విడుదల చేయాలని, మూతపడిన డిస్పెన్సరీలను తెరవాలని వినతిపత్రంలో కోరారు.