30న టెన్త్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వార్షిక పరీక్షల ఫలితాలు ఈనెల 30న విడుదల కానున్నాయి. గతనెల 18 నుంచి ఈనెల రెండో తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది అబ్బాయిలు, 2,50,433 మంది అమ్మాయిలున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్‌ వాల్యుయేషన్‌) ప్రక్రియ ఈనెల నాలుగో తేదీ నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో 18 జిల్లాల్లో 19 మూల్యాంకన కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 30న పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని బుధవారం ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాల సందర్భంగా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.