నవతెలంగాణ-నల్లగొండ
సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలో బజార్ హమాలీలతో కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలిలందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. హమాలి కార్మికులకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి ప్రభుత్వం నుంచి రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని, అన్ని రకాల హమాలీలకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కనీస వేతనం గుర్తింపు కార్డులివ్వాలన్నారు. ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వంతో సంబంధం ఉన్న మార్కెట్ యార్డు సివిల్ సప్లై బేవరేజెస్ ఎలక్ట్రిసిటీ స్టోర్ ఎఫ్‌సీఐ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ భీమగాని గణేష్, హమాలీ యూనియన్ అధ్యక్షులు నరాల వెంకన్న, శ్రీను, నవీన్, శేఖర్, వెంకన్న, వీరయ్యపాల్గొన్నారు.