– ఈసీకి ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగుల లేఖ
న్యూఢిల్లీ : ఈ నెల 21న రాజస్థాన్ లోని బన్‌స్వారాలో విద్వేషపూరిత ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోడీపై చర్య తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 93 మంది మాజీ ఉన్నతోద్యోగులు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ముస్లిం మైనారిటీలపై విషం చిమ్ముతూ మోడీ చేసిన ప్రసంగంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే 2,200కు పైగా ఫిర్యాదులు అందాయి. అహ్మదాబాద్ ఐఐఎం మాజీ ప్రొఫెసర్ జగదీప్ ఛోకర్ కూడా ఈసీకి ఓ లేఖ రాశారు. ప్రధాని ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఐపీసీలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆ లేఖలో తెలిపారు. ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగులు తమ లేఖలో జగదీప్ అభిప్రాయంతో ఏకీభవించారు. 1951వ సంవత్సరపు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123 (3), 123 (3ఏ), 125 సెక్షన్లను ప్రధాని ప్రసంగం ఉల్లంఘించిందని జగదీప్ ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చారు. అంతేకాక ఆ ప్రసంగం ఐపీసీ సెక్షన్ 153 (ఏ)ను కూడా ఉల్లంఘిస్తోందని తెలిపారు.