– ఆన్‌లైన్‌లో రూ.1 లక్ష కోట్ల వ్యయం
– రూ.60వేల కోట్ల చేరువలో ఆఫ్‌లైన్ లావాదేవీలు
– దేశంలో 10.2 కోట్ల కార్డులు
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు వ్యయాలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. 2024 మార్చిలో తొలిసారి ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల ఖర్చులు రూ.1,04,081 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. 2024 ఫిబ్రవరిలోని రూ.94,774 కోట్లతో పోలిస్తే 10 శాతం పెరగ్గా.. 2023 మార్చిలో నమోదైన రూ.86,390 కోట్ల వ్యయాలతో పోలిస్తే ఏకంగా 20 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. చిన్న కొనుగోళ్లకూ క్రెడిట్ కార్డులను వినియోగిస్తుండటంతో వీటి పరిమాణం గణనీయంగా పెరిగింది. దీంతో ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్లు రికార్డ్ స్థాయిలకు చేరుతున్నాయి. దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య 10.2 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం పెరిగింది. క్రెడిట్ కార్డులతో ఆఫ్‌లైన్‌లో జరిగే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) లావాదేవీలూ భారీగానే పెరిగాయి. 2023 మార్చిలో రూ.50,920 కోట్లుగా ఉన్న ఆఫ్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల వ్యయాలు.. గడిచిన నెలలో19 శాతం పెరిగి రూ.60,378 కోట్లకు చేరాయి. మొత్తంగా క్రెడిట్ కార్డ్ లావాదేవీలు 20 శాతం పెరిగి రూ.1,64,586 కోట్లకు చేరాయి. క్రెడిట్ కార్డుల జారీలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 20.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఎస్‌బీఐ 18.5 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 16.6 శాతం, యాక్సిస్ బ్యాంక్ 14 శాతం, కొటాక్ మహీంద్రా బ్యాంక్ 5.8 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్న టాప్ 10 బ్యాంకులే మొత్తం 90 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.