– గంగలో కలిసిన హామీలు
– కేటాయింపుల్లో కోత…ధరల వాత
– రుణమాఫీ ఊసే లేదు
– విపత్తు నిధి నుండి సాయమూ రాదు
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోంది. వారికి మితిమీరిన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. అదే సమయంలో అన్నదాతల నెత్తిన శఠగోపం పెడుతోంది. వ్యవసాయ బడ్జెట్‌ను కుదిస్తోంది. ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. సబ్సిడీలలో కోత పడుతోంది. మోడీ హయాంలో రైతు రుణాల మాఫీ ఊసే లేదు. పెట్టుబడి వ్యయం పెరగడం, ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు లభించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ ఉదాశీనత కారణంగా అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇక వ్యవసాయ కార్మికుల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
చెప్పిందేమిటి?
పంటలు పండించడానికి రైతన్నలకు అయిన ఖర్చుకు కనీసం ఒకటిన్నర రెట్లు అదనంగా రాబడి ఉండేలా చూస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నమ్మబలికింది. రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది. ప్రతి రైతు కుటుం బానికీ లక్ష రూపాయల వరకూ వడ్డీ లేని రుణం ఇస్తామని తెలిపింది. అయితే ఈ హామీ లలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు.
ఉపాధి హామీకి తూట్లు
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం మాట అటుంచి బీజేపీ ప్రభుత్వం తన రైతు వ్యతిరేక విధానాల ద్వారా వారిని కష్టాల పాలు చేసింది. వార్షిక వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులను 30% మేర కుదించింది. వ్యవసాయ సబ్సిడీలలో కోత విధించడంతో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, డీజిల్, ఇతర వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరిగిపోయాయి. గ్రామీణ వ్యవసాయ కార్మికులకు వరప్రదాయినిగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం నీరుకార్చింది. దానికి అవసరమైన నిధులలో కోత పెట్టింది. ఉపాధి హామీ పథకానికి ఏటా రూ.2.72 లక్షల కోట్లు అవసరం కాగా 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.73,000 కోట్లు మాత్రమే విదిల్చింది.
పెరిగిన రుణభారం
బీజేపీ ప్రభుత్వం రైతు రుణాల మాఫీ ఊసే మరిచింది. దేశంలోని రైతులందరి రుణాలు మాఫీ చేయడానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు సరిపోతాయి. అయితే నిధుల కొరత కారణంగా తాము అన్నదాతల రుణాలు మాఫీ చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. కానీ అదే సమయంలో కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన రూ.30 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసింది. మోడీ పాలనలో రైతు కుటుంబాలపై రుణభారం 30% పెరిగింది. దీంతో అన్న దాతలు రుణాల ఊబిలో కూరుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు సహాయ నిధిని కూడా దుర్వినియోగం చేసింది. వరదలు, కరువు కాటకాలు, ఇతర విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఈ నిధి నుండి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు. దానికి బదులుగా రైతులను పంట బీమా దిశగా నెట్టేసింది. పంట బీమా అనేది ప్రైవేటు కంపెనీల చేతిలో ఉంటుంది. దీంతో రైతులు దోపిడీకి గురయ్యారు.
చట్ట సవరణలతో కంపెనీలకు వరాలు
ఏది ఏమైనా సరే రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేయాలని మోడీ ప్రభుత్వం భావిం చింది. అయితే చివరికి అన్నదాతల ఆగ్రహంతో వాటిని వెనక్కి తీసుకుంది. రైతులకు మద్దతు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన వ్యవ సాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లను రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం చట్టాల కు దారుణ మైన సవరణలు చేసింది. భూ చట్టానికి చేసిన సవరణల కారణంగా రైతుల భూములను తేలికగా కొనుగోలు చేసేందుకు కంపెనీలకు అవకాశం లభించింది. భూసేకరణ చట్టాలను సవరిం చడం ద్వారా రైతుల భూములను లీజుకు ఇవ్వ డానికి కంపెనీలకు మార్గం సుగమమైంది.
అవిశ్రాంత పోరాటంతో…
ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరించినప్పటికీ రైతన్నలు సంవత్సర కాలానికి పైగా రాజధాని వీధులలో అలుపెరుగని పోరాటం సాగిం చారు. విస్తృత స్థాయిలో జరిగిన ఈ నిరసనలు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఆందోళన సంద ర్భంగా పలువురు మహిళా రైతులు సహా 752 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అజరు మిశ్రా తెనీ కుమారుడు ఉద్దేశపూర్వకంగా వాహనాన్ని నడిపి, ఎనిమిది మందిని పొట్టనపెట్టు కున్నాడు. అందరి కళ్ల ఎదుటే ఈ దారుణం జరిగినప్పటికీ మోడీ ప్రభుత్వం అజరు మిశ్రాను మంత్రి పదవి నుండి తొలగించలేదు. ఆయనపై కఠిన చర్యలేవీ తీసుకోలేదు. బీజేపీ నేతలు మోసపూరిత ఎత్తుగడలు అనుసరించినా, భయపెట్టేందుకు ప్రయత్నించినా, చెదరగొట్టాలని చూసినా రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
వలస పక్షులుగా…
పంట ఉత్పత్తులకు తగిన ధర లభించకపోవడం, గ్రామాలలో పని లేకపోవడం, రుణాలను తిరిగి చెల్లించే దారి లేకపోవడంతో రైతులు పెద్ద సంఖ్యలో గ్రామాలను వదిలి ఉపాధి కోసం పట్టణాలు, నగరాల బాట పట్టారు. 2016 నుండి 2023 వరకూ…అంటే గడచిన ఆరు
సంవత్సరాలలో నాలుగు కోట్ల మంది ప్రజలు గ్రామాల నుండి
నగరాలకు వలస వెళ్లారు.
ఎన్నికల హామీనీటి మూటే
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీ హఠాత్తుగా టీవీ తెరపై ప్రత్యక్షమయ్యారు. రైతులను క్షమాపణ కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానని, ఇతర రైతు డిమాండ్లను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాత రైతులు తిరిగి తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఇది జరిగి సంవత్సరం గడిచినా తన హామీలు నెరవేర్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న దాఖలాలేవీ కన్పించడం లేదు. ఈ విధంగా
అన్ని రకాలుగా మోడీ ప్రభుత్వం రైతులను వంచించింది.
ఆత్మహత్యల బాటలో…
అధికారిక లెక్కల ప్రకారమే గత పది సంవత్సరాల కాలంలో దేశంలో 1,74,000 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అంటే ప్రతి రోజూ 30 మంది రైతులు జీవనయానం సాగించలేక ప్రాణాలు తీసుకున్నారు.
కారణమేమిటి?
రైతుల విషయంలో ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడానికి కారణం సుస్పష్టం. అన్నదాతలను వారి భూముల నుండి తరిమివేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. భూములపై వారికి ఉన్న నియంత్రణను లాగేసుకోవాలని వ్యూహం పన్నింది. వారి భూములు, ఉత్పత్తులను కార్పొరేట్ కంపెనీల పరం చేయాలని కుట్ర చేస్తోంది. అదానీ, అంబానీ ఇప్పటికే వ్యవసాయ రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టారు. రైతులు ఉపయోగించే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు, ట్రాక్టర్లు, టిల్లర్లు, ఇతర వ్యవసాయ పరికరాలపై వారు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడు వారు రైతన్నల భూములు, పంటలపై కన్నేశారు. అందుకే ఎపీఎంసీ చట్టం, భూసేకరణ చట్టం, భూ లీజు చట్టానికి సవరణల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల వైఖరి ఒకటే. రైతుల భూములు కొనుగోలు చేయడం లేదా వారు పండిస్తున్న పంటలపై పెత్తనం చేయడం. తాము నిర్ణయించిన ధరకు తమకే పంట ఉత్పత్తులు విక్రయించేలా రైతన్నలపై ఒత్తిడి తేవడానికి కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రైతులకు రక్షణగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ ప్రయోజనాలకు బాసటగా ఉంటోంది. వ్యవసాయాన్ని, రైతు సమాజాన్ని అణగదొక్కేందుకు కార్పొరేట్ కంపెనీల అజెండాను అమలు చేస్తోంది. అందుకే రైతు చట్టాల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అన్నదాతల జీవితాలను, వారి జీవనోపాధిని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలన్నీ సంఘటితమై జీవన్మరణ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. మరోవైపు రైతుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారిని ఉగ్రవాదులుగా చూస్తోంది. వారి ఆందోళనను అణచివేయాలని యత్నిస్తోంది. ఈ ఆందోళన విజయవంతమైనప్పుడే రైతు సమాజం మనుగడ సాధ్యపడుతుంది. లేకుంటే అన్నదాతలు నిరుపేద కార్మికులుగా మారిపోతారు.