కామ్రేడ్ల సహకారంతో భారీ మెజార్టీ

– ఖమ్మంలో రఘురాంరెడ్డి గెలుపునకు సమష్టి కృషి : మంత్రి తుమ్మల
– లౌకిక పార్టీలతోనే దేశ భవితవ్యం : పొంగులేటి
– మోడీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం : రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి
– ‘ఇండియా’ లో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
– సిద్ధాంత ప్రాతిపదికన కాంగ్రెస్‌తో కూటమి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
– రాముడు.. బీజేపీ ఒక్క పార్టీకే దేవుడే కాదు : ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి
– కాంగ్రెస్‌, వామపక్షాల ర్యాలీగా రఘురాంరెడ్డి నామినేషన్‌
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వామపక్షాల సహకారంతో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే కాంగ్రెస్‌ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల సమష్టి కృషితో ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలతో పాటు రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. గురువారం ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి (ఆర్‌ఆర్‌ఆర్‌) నామినేషన్‌ అనంతరం కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలతో కలిసి మంత్రి తుమ్మల మాట్లాడారు. జిల్లా పార్టీ అభిప్రాయ సేకరణ తర్వాతే రఘురాంరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలిపారు. జిల్లా ప్రజల మనోభావాలకు తగినట్టుగా రఘురాంరెడ్డి ఎంపీగా విజయం సాధించి.. ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సెక్యులర్‌ పార్టీలతోనే దేశ భవితవ్యమని అన్నారు. రఘురాంరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ దేశాన్ని గాడిలో పెట్టాలంటే సెక్యులర్‌ పార్టీలతోనే సాధ్యమన్నారు. రఘురాంరెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. మోడీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీని ప్రతిపక్షాల ఇండ్ల మీదకు ఉసిగొల్పుతున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యం గుడిలోకి రాక్షసులు : ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
ప్రజాస్వామ్యమనే గుడిలోకి రాక్షసులు చొరబడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడినా.. మతం పేరుతో వ్యాఖ్యలు చేసినా.. జేబుసంస్థగా మారిన ఈసీ మోడీపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల విధ్వంసాన్ని సాగనంపినట్టుగానే ఎన్డీఏను సైతం దేశం నుంచి తరిమివేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు జరిగిన వందకు పైగా పార్లమెంట్‌ సీట్లకు ఎన్నికలు పూర్తవగా.. బీజేపీకి మెజార్టీ రాదని సర్వేలు చెబుతున్నాయన్నారు. అబద్ధాలు చెప్పే ప్రధాని.. రాముని పేరు చెప్పి దోఖా చేస్తున్నారని అన్నారు. సిద్ధాంత ప్రాతిపదికన కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కలిశారని తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల ఖిల్లా అని తెలిపారు.
ఇండియా కూటమిలో భాగంగా మద్దతు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
బీజేపీ మతోన్మాద, ఫాసిస్టు, కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. భువనగిరి పార్లమెంట్‌ స్థానం మినహా అన్ని చోట్లా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపికైన రఘురాంరెడ్డికి అభినందనలు తెలిపారు.
నేనూ ఖమ్మం జిల్లా వాసినే..: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రామసహాయం
తానూ ఖమ్మం జిల్లా వాసినేనని,.. తన బాల్యమంతా కూసుమంచి మండలం చేగొమ్మలో సాగిందని, అక్కడి తమ భూములు పేదలకు పంపిణీ చేశామని, ఒకప్పుడు తమ ఇంటి స్థలం, ఇంటిని అక్కడి ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చినట్టు కాంగ్రెస్‌ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. రాముడు.. బీజేపీ ఒక్క పార్టీకే దేవుడే కాదని, అందరివాడని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలుపుకోలేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తోందని, చివరకు డిఫెన్స్‌ఫోర్స్‌ను సైతం కాంట్రాక్టుకు ఇచ్చే పద్ధతి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకిప్పుడు 63 ఏండ్లని, తన పిల్లలు సెటిల్‌ అయ్యారని, ఈ వయసులో ప్రజా సేవ చేయడమే తన పని అని అంటూ మాటలు కాదు చేతల్లో తానేంటో చూపిస్తానని తెలిపారు. నామినేషన్‌కు ముందు స్థానిక కాల్వొడ్డు నుంచి వైరా రోడ్డు మీదుగా కలెక్టరేట్‌ వరకు కార్లు, ఆటోలతో వందలాది మంది ర్యాలీగా తరలివచ్చారు. కాల్వొడ్డులో కాంగ్రెస్‌ శ్రేణులతో సీపీఐ(ఎం), సీపీఐ నేతలు, కార్యకర్తలు ర్యాలీని స్వాగతించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాళోత్‌ రాందాస్‌నాయక్‌, మట్టా రాగమయి, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంత్‌రావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఎండీ జావీద్‌, నాయకులు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.