మనిషీ – బాలుడు

మనిషీ - బాలుడుఈ భూమ్మీద ఎందరో కబ్జాదారులు పుట్టి, పెరిగి అనేక భూముల్ని కబ్జా చేసి, ప్రసిద్ధ కబ్జాదారులుగా పేరూ, ప్రఖ్యాతీ, నోట్ల కట్టలూ సంపాదించేరు. కానీ అసలు సిసలు కబ్జాదారుడూ, ప్రసిద్దుడూ ఎవరనగా నెవరు? వాడి పేరు హిరణ్యాక్షుడే కదా!
పూర్వం జ్ఞానం వున్న వాళ్లు కొందరు (కొందరే వుండేవారు) ఈ భూమి అనేది, నలుచదరంగా మనందరి ఇండ్లల్లో వుండే చాపలాగా వుండేదని సెలవిచ్చారు. వాళ్లది జ్ఞానమనే నమ్మి హిరణ్యాక్షుడు, లోకంలో మొట్టమొదటి లాండ్‌ గ్రాబర్‌ అవ్వాలని భూమి అనే చాపని చుట్టి చంకలో పెట్టుకుందామని బయలుదేరాడు. ఒకవేళ అది చాపలాగానే వుండి వుంటే ఇప్పటికీ దాన్ని మడత చుడుతూనే ఉండి పోయేవాడేమో కానీ అది గుండ్రంగా బంతిలా వుండడంతో చచ్చి బతికిపోయాడు. దాన్ని అంటే లాండుని ఎక్కడ ‘లాండు’ చేయాలో తెలీక సముద్రంలో దాక్కుని అదృష్టం కలిసిరాక రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చెయ్యలేకపోయాడు.
అసలు ఈ భూమి చాపలా, టేబిల్‌ టాప్‌లా స్కేర్‌గా వుండక బంతిలా సర్కిల్‌గా వుండడానికి కారణమేమిటో అర్ధం కాదు. అసలు భూమే కాదు, తత్తిమా గ్రహాలన్నీ కూడా మరో షేప్‌లో లేకుండా గుండ్రంగా ఫుట్‌బాల్‌లా వుండడానికి కారణం ఏమిటి? ఈ బిగ్‌ బాల్స్‌ తయారు చేసిన వాడికి ఫుట్‌బాల్‌ అంటే ప్రత్యేకమైన ఇంటరెస్ట్‌ వుండి వుండాలి. వాడో గొప్ప సాకర్‌ ప్లేయర్‌ అయి ఉండాలి.
సాకర్‌ అనేది ఓ మామూల జలుబూ పడిశం కాదు. ప్రపంచం మొత్తాన్ని వణికించే చలిజ్వరం. లాటిన్‌ అమెరికాలో అయితేనేం, యూరప్‌ అయితేనేం, రష్యా, జపాన్‌, కొరియా, ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా తన్నరా ఈ బంతి గోల్‌లో పడదన్ను’ అని ఊరికే అన్నారా? ఇదో జన సునామీ, ఓ మాస్‌ హిస్టీరియా. ఈ బంతి ఆట కోసం జనం జిమ్ములూ, ఆఫీసులూ, రొటీన్‌ జీవితమూ, ఒళ్లు మరచిపోయి కళ్లు ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఫిక్స్‌ చేయడం చూసి ఆశ్చర్యపడాల్సిన పనేలేదు. ఈ బంతికి పిల్ల బంతిలా వుండే క్రికెట్టు గ్రౌండులో జనం హోరెత్తి పోవడం తక్కువేమీ కాదు.
ఎందుచేత? ఎందవలన? అంటే మనిషికీ బంతికీ వున్న రిలేషన్‌ అట్లాంటిది మరి. అసలు మనిషనే వాడు ఉండేదెక్కడీ బంతిమీదనే కద. తన బతుకునందు సుఖదు:ఖాలు, భాగ్య సౌభాగ్యాలు, అదృష్ట దురదృష్టాలు అన్నీ తొమ్మిది బంతుల మీద ఆధారపడి వున్నాయనే నమ్మకం బలంగా వున్న మనుషులు లేకపోలేదు. ఆశ ఉత్తర దృవం, విధి దక్షిణ దృవం, మనిషి ఈ రెంటి మధ్య బంతిలా ఎగిరిపడే ప్రహసనం అన్నాడో మహానుభావుడు. ఇంకేముంది.. క్లారిటీ వచ్చినట్టే కదా! అసలు మనిషే ఒక బంతి. వయసు పెరుగుతున్న కొద్దీ షేప్‌లో మార్పు వచ్చే బంతి. చూడ్డానికి గడకర్రలా చక్కగా కనిపించే మనిషి నిజానికి ఒక బంతేనని, వాడి బతుకు మోషన్‌ పిక్చర్‌ చూస్తే చాలు అర్ధమవుతుంది. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్టు, ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి బంతొకటి విసిరేసి, పారేసి, దొర్లించి, పొర్లించి తన్నిస్తాడు ఆ బాల్‌ మేకర్‌.
పుట్టీపుట్టగానే నోముల పంటని, బంగారు కొండని ఊయల్లో ఊపి ముద్దు చేస్తారు బంతిని. ఒళ్లో లాలించి, ఛాతి మీద పడుకోబెట్టుకుని, వీపు మీద ఎక్కించుకుని పూవులా చూసుకునే బంతిని మూడో ఏడు రాగానే కిండర్‌ గార్డెన్‌లోకి దొర్లించేస్తారు. అక్కడ మొదలవుతుంది బంతి ఆట. చిన్నచిన్నగా, మెత్తమెత్తగా, కొత్తకొత్తగా తన్నుల ఆట. ఇక పెద్ద బడికి వచ్చేటప్పటికి మనిషిని ‘బాలుడు’ అని పిలుస్తారు. బాలుడు అన్న పదంలో బాలు వుందా? లేదా? ఈ బాలుని లెక్కల మాస్టార్‌ ఓ తన్ను తంతాడు. బాలు వెళ్లి ఇంగ్లీషు మాస్టర్‌ కాలుకి అందుతుంది. ఆ మాస్టర్‌ ఇంగ్లీషులో ఓ కిక్కు కిక్కితే బాలు వెళ్లి సైన్సు మాస్టర్‌ కాళ్ల సందున ఇరుక్కుంది. మానవుడుగా పిలవబడే ఈ బంతిని కాలేజీలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌ వైపు, ఆయన దాన్ని లెక్చరర్ల వైపు తంతూ వుంటే సరదా ఆట సాగుతుంది. ఈలోపున యంగ్‌ బంతితో బ్యూటిఫుల్‌ అమ్మాయిలు కూడా తమాషా ఆట ఆడుకుంటారు. ఎటునుంచి ఎటు దొర్లాలో తెలీక బంతి అనేక కలలు కంటూ బోలెడు సాడ్‌ సాంగ్స్‌ పాడేస్తుంది.
ఇప్పుడిక బంతి లోకమనే పెద్ద ప్లే గ్రౌండులోకి వచ్చిపడుతుంది. బయోడేటాతో, సర్టిఫికెట్ల ఫైల్‌తో, ఆఫీసుల్లో, ఫర్మ్‌ల్లో కంపెనీల్లో తెగ దొర్లుతుంది. తెగ తన్నబడుతుంది. తన్నినోడే తంతాడు. తన్నిన చోటే తంతాడు. ఎవరు తన్నినా, ఎన్ని తన్నినా బంతి బంతేగా. తన్నించుకోవడం తప్ప, దొర్లడం తప్ప బంతి మరేమీ చేయలేదు కదా. అయినా బంతి తన్నులు తప్పించుకుని ఎక్కడో ఓ చోట నింపాదిగా వుందామని, ఊపిరి పీల్చుకుందామని, సెటిలైపోదామని ప్రయత్నం చేస్తూనే వుంటుంది. దొర్లకుండా, తన్నించుకోకుండా వుండాలని ప్రయత్నం కొనసాగిస్తూనే వుంటుంది.
ఇంటర్వ్యూలో ఈ చివర వున్న సూట్‌ వాలా జాగ్రఫీతో ఒక తన్ను తంతే బంతి ఆ చివరన వున్న బట్టతలకు అందుతుంది. ఆ బట్టతల ఏదో లెక్కతో లాగి తంతే మధ్యలో వున్నవాడి వెటకారపు నవ్వుకి బంతి గదిలోనుంచి బయటకు దొర్లుతుంది. ఇలాగ ప్రతి ఇంటర్వ్యూ ఒక ప్లే గ్రైండవుతుంది. జనరల్‌ నాలెడ్జ్‌తో, సైన్స్‌తో, కంప్యూటర్‌తో, ఇంగ్లీషు లాంగ్వేజీతో, కరంట్‌ ఎఫైర్స్‌తో రకరకాలుగా బంతి మూల మూలకు తన్నబడుతుంది. ఈ మధ్య ఆన్‌లైన్‌లో కూడా బంతి తన్నులు తింటున్నది. ఇలా తన్నించుకుని తన్నించుకుని అలసిపోయాక బంతి ఓ ఆఫర్‌ లెటర్‌ దొరికించుకుని ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంటుండగానే ‘ఒరే బంతీ, ఓ ఇంటివాడవవ్వాలిరా’ అని వెంటపడతారు.
ఇకనైనా కుదురుగ్గా ఇంట్లో కూచోవచ్చు గదా అని బంతి సంతోషపడుతుంది. సంసారం అనే ప్లే గ్రౌండులో వచ్చి పడుతుంది. బంతన్నాక, గ్రౌండన్నాక తన్నులు తప్పుతాయనుకోవడం ఒట్టి భ్రమ. సరుకులూ, సామాన్లూ, బొగ్గులూ, రాత్రికి రగ్గులూ, సంధ్యాసమస్యలూ, కష్టాల్‌ నష్టాల్‌ కోపాల్‌ తాపాల్‌, తెర చాపలు, ఉరికొయ్యలు… బంతి బతుకే అంత. మనిషనగా నెవ్వడు?
బంతిగా పుట్టి, బంతిగా పెరిగి, బంతిగా దొర్లి, బంతిలా తన్నించుకుని, ఎగిరీ, పొర్లీ, కదిలీ, కదుల్తూనే వుంటాడు కడదాకా. గోల్‌కీపర్‌, చేతికి చిక్కిన బంతిని పునర్జన్మంటూ మళ్లీ ప్లేగ్రౌండులోనే విసిరేస్తాడు అంటారు కొందరు. ఈ చివరి నుంచి ఆ చివరాఖరు వరకు ‘భ్రమాంభ్రమణ’ జీవితం కదా బంతిదీ! బంతిలాంటి మనిషిదీ!
– చింతపట్ల సుదర్శన్‌
9299809212