ధరణికోట

ధరణికోట”హారిక! నా జీవితంలో వెలుగులు నింపడానికి నా సహధర్మచారిణిగా మా యింట అడుగిడతావా..?” అంటూ హఠాత్తుగా హారికని ప్రతిపాదించాడు అర్జున్‌, గూగుల్‌ డ్యుయో వీడియో గ్రూప్‌ కాలింగ్‌లో యిరు కుటుంబాలు కూర్చుని నింపాదిగా ముచ్చటించుకుంటుండగా.
కోవిడ్‌ పరిస్థితుల దృష్యా మొదటిసారిగా దేశమంతా లాక్‌డౌన్‌లో వుండటంతో భాగ్యనగరంలోనే వుంటున్న అర్జున్‌, హారికల యిరు కుటుంబాలు యిదివరకటిలా కలుసుకోవడంలేదు. అందుకే ఇలా గూగుల్‌ డ్యుయో గ్రూప్‌ వీడియో కాల్లో కలుసుకుని మంచి చెడ్డలు మాట్లాడుకోసాగారు. అదిగో సరిగ్గా ఆ సమయంలోనే అర్జున్‌ అనూహ్యంగా అందరి ఎదుట హారికని ప్రతిపాదించి ఆశ్చర్యపరిచాడు.
రెండు నిమిషాలు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది.
అర్జున్‌ లాప్‌టాప్‌ స్క్రీన్‌ మీద అందరి వైపు ఉత్కంఠంతో చూస్తున్నాడు, తన ప్రతిపాదనకి ఎవరు ఏ విధంగా స్పందిస్తారోనని.
హారిక ఈ ప్రతిపాదనకి ఆశ్చర్యపోలేదు. అందుకు కారణం లేకపోలేదు. యిద్దరూ ఒకనొకరు చాలా ఏళ్ళగా ఎరిగినవారే. వారి స్నేహం ఈ మధ్యే ప్రేమగా మారింది. హారికకి అర్జునంటే యిష్టం అన్న మాట పక్కన పెడితే, ముఖ్యంగా యిరువురి తండ్రులూ చాలా ఏళ్ళుగా మంచి మిత్రులు. అందుకే తమ బంధంతో వారి స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని అనుకున్నారు. ముఖ్యంగా తమ పెద్దలకి తాము ఒకటి కావాలని వుందని వారికి తెలుసు. పెద్దలే తమ పెళ్ళి ప్రస్తావన తీసుకొస్తారని హారిక ఆశిస్తున్న సమయంలో, అర్జున్‌ చొరవ తీసుకుని ఈ విధంగా లైవ్‌ వీడియో కాల్లో విన్నూతనంగా ప్రతిపాదించి తమ ప్రేమ విషయం అందరికీ తెలియజేస్తాడని మాత్రం ఊహించలేదు.
అక్కడి నిశ్శబ్దాన్ని చీలుస్తూ ముందుగా చప్పట్లు కొట్టి హర్షించింది హారిక తండ్రి శంకరం. వెనువెంటనే చప్పట్లతో తన ఆనందం వ్యక్తపరచింది హారిక తల్లి భ్రమర. అప్పుడు ఒకింత సిగ్గుతో-
”అంకుల్‌.. ఆంటీలకి యిష్టమైతే, నీతో కలసి జీవితాన్ని పంచుకోవడానికి నాకేమి అభ్యంతరంలేదు..” అంటూ అర్జున్‌ ప్రతిపాదనని అమోదించింది హారిక.
ఒక్కొక్కరే తన ప్రతిపాదనని స్వాగతిస్తుండటంతో అర్జున్‌ మాటలకందని సంతోషాన్ని పొందాడు.
యిటు అర్జున్‌ తల్లి అరుంధతి పిల్లలిద్దరికీ గాలిలోనే ముద్దులు పెడుతూ తన అంగీకారాన్ని తెలిపింది.
అంతా సంతోషంగా చప్పట్లతో సందడిచేస్తుంటే, అర్జున్‌ తండ్రి వీరభద్రం మౌనంగా చూస్తున్నాడు.
”నాన్నా..! మొదట మీరే స్పందిస్తారనుకుంటే, మౌనంగా వున్నారేంటి? మాట్లాడండి” అన్నాడు అర్జున్‌, తండ్రి అంగీకారానికి ఎదురుచూస్తూ.
”అర్జున్‌ అన్నది నిజమేరా వీరా! పిల్లలకి నువ్వే మొదట అభినందనలు తెలుపుతావనుకున్నాను. గత కొన్ని నెలలుగా ఫోన్లోనూ నువ్వు సరిగ్గా మాట్లాడం లేదు. అనుకోకుండా ఈ విధంగా కలిసి అందరం మనసువిప్పి మాట్లాడుతుంటే, యిప్పుడేంటా మౌనం?” అన్నాడు శంకరం, వీరభద్రంతో.
అప్పుడు నోరు విప్పాడు వీరభధ్రం… ”నో..నాకీ సంబధం యిష్టం లేదు!” అంటూ అందరి ఉత్సాహం మీదా ఒక్కసారిగా నీళ్ళు జల్లాడు.
కాసేపు అక్కడ మళ్శీ నిశ్శబ్దం అలుముకున్నా, వెంటనే ఒక్కసారిగా అందరూ వీరభధ్రం మాటలకి పకపక నవ్వేసారు.
”నాన్నా! గుడ్‌ జోక్‌..! మీ మనసులోని అసలు మాట చెప్పండి..” బయటకి నవ్వుతున్నా, లోన కాసింత ఆందోళనతో అన్నాడు అర్జున్‌.
”ఒరే వీరా..! పిల్లల్ని ఏడిపించింది చాలు. నిజం చెప్పు” అన్నాడు శంకరం నవ్వుతూ.
”యస్‌.. ఐ యామ్‌ సీరియస్‌. ఈ సంబంధం నాకు యిష్టం లేదు” అంటూ బల్లగుద్దినట్టు చెప్పాడు వీరభద్రం.
ఊహించని విధంగా వీరభద్రం తన నిర్ణయాన్ని నొక్కివక్కాణించే సరికి యిటు పిల్లలే కాదు, మిగిలిన పెద్దలూ అప్పుడు విస్తుపోయారు.
యిక అర్జున్‌, హారికల ముఖాలలో నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనపడితే, ఏం మాట్లాడాలో తెలీని పరిస్థితి మిగిలిన వారి మధ్య నెలకొంది.
‘ఈ వీరభధ్రం కేమైంది? ఎందుకలా ‘నో’ చెప్పాడూ?’ మనసులోనే మదన పడ్డాడు శంకరం.
”అన్నయ్యగారికి ఒక్కసారిగా ఏమైంది..? మీరిద్దరూ మంచి మిత్రులు. పిల్లలిద్దర్ని ఒకటి చెయ్యాలని మన అందరి మనసుల్లో ఎప్పట్నుండో వున్నదే కదా. గతంలో ఈ విషయం మన మధ్య దొర్లినప్పుడు పిల్లల్ని కలపడానికి ముందుగా చొరవ చూపించింది అన్నయ్యగారే! మరిప్పుడు ఏమైంది?” ఏమీ పాలుపోకా అంది భ్రమర లాప్‌టాప్‌ వాల్యూమ్‌ మ్యూట్‌ చేస్తూ పక్కనున్న భర్తతో.
యిటు అర్జున్‌, హారికలు అయెమయానికి గురైతే, అటు అరుంధతికి తన భర్త ప్రవర్తన అంతుచిక్కలేదు. గత సంవత్సరమంతా, ఎప్పుడు తన స్నేహితుడు హారికని తన కొడుక్కి చేసుకోమని అడుగుతాడా? అని ఎదురు చూసిన యితడేనా ఈనాడు కాదంటున్నాడూ? అనుకుంది మనసులో.
కాసేపటికే హారిక, వీరభద్రం నిర్ణయానికి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది. హారిక స్థితికి అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది.
”నాన్నా! అందరికంటే మీకే ఈ సంబంధం కలుపుకోవలని ఎక్కువగా వుందనుకుంటే, యిప్పుడు ఇష్టం లేదంటారేంటి? కారణమేంటో చెప్పండి?” అడిగాడు అర్జున్‌.
”అర్జున్‌! ఈ మేటర్‌ యిక్కడితో వదిలేయి. నాకు యిష్టం లేదన్నాను, అంతే..”అన్నాడు కోపంగా వీరభధ్రం.
ఇక చూస్తూ ఊరుకోలేక శంకరం, స్నేహితుడ్ని సూటిగా అడిగాడు.
”వీరా..! యిష్టంలేదంటే సరిపోదు. ఇది మనిద్దరి విషయమైతే నేనడిగేవాడినే కాదు. కాకపోతే పిల్లల జీవితానికి సంబధించింది కావడంతో నువ్వు హఠాత్తుగా ఎందుకొద్దంటున్నావో కారణం చెప్పల్సిందే”
”శంకరా! నే చెప్పాగా యిష్టం లేదని. యిక ఈ విషయం వదిలేరు. నా చేత ఎక్కువ మాట్లాడనీయకు”
”వీరా..! ఏదీ మనసులో దాచుకోక నిక్కచ్చిగా మాట్లాడే తత్వం నీది. యిప్పుడెందుకు వెనకాడుతున్నావ్‌? అసలు కారణం చెప్పి తీరల్సిందే..!” రెట్టించాడు శంకరం.
”అయితే.. విను. నీలాంటి దివాలాకోరుతో సంబంధం ఎలా కలుపుకోమంటావ్‌? నీ సర్వసం ఫణంగా పెట్టి అధిక ధరకి అమరావతి దగ్గర్లో ఎకరం స్థలం కొన్నావ్‌. యిప్పుడేమైంది? రాజధాని తరలిపోయింది. దాంతో నీ తలరాత తలక్రిందులైంది. ఒక విధంగా యిప్పుడు భికారివి. మన మధ్య అంతస్థుల తారతమ్యంతో పాటు అంతరాలూ పెరిగిపోయాయి. ఇక ఈ విషయం మరచిపో” కర్కశంగా కడుపులోని మాట కక్కేసాడు వీరభధ్రం. ఈ సమాధానానికి అక్కడున్న అందరూ కొద్దిసేపు స్థాణువులైపోయారు.
తనమనసులో మాట చెప్పి యింక అక్కడ ఒక్క క్షణం వుండక లేచి వెళ్ళబోతున్న వీరభద్రంని ఆపుతూ-
”నాన్నా.. మీరేనా యిలా మాట్లేది? నమ్మలేకపోతున్నా. ఆగండి ప్లీజ్‌..!” అన్నాడు అపనమ్మకంగా అర్జున్‌. ఆ వెంటనే శంకరాన్ని ఉద్దేశించి-
”అంకుల్‌..! మా నాన్న మాటలకి నొచ్చుకోవద్దు. నేను నాన్నతో మాట్లాడతా” అంటూ అర్జున్‌ శంకరంని అర్ధించాడు. యింతలో శంకరం వీరభద్రంనుద్దేశించి-
”వీరా! ఆగు. ఒక్కసారి నే చెప్పేది పూర్తిగా విను..” అంటూ మిత్రుడ్ని ఆపబోయాడు.
ఎవరి మాటలూ పట్టించుకోకుండా వీరభద్రం ఎస్కేప్‌ బటన్‌ నొక్కి వీడియో కాల్‌ నుండి ఎగ్జిట్‌ అయ్యాడు.
వీరభద్రం చర్యకి శంకరం హతాసుడయ్యాడు. చేసేది లేకా తాను కూడా వీడయో కాల్‌ క్లోజ్‌ చేసి ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుండిపోయడు. ఆ తరువాత ఒక్కొక్కరే గ్రూప్‌ వీడియో కాలింగ్‌ నుండి ఎగ్జిట్‌ అయ్యారు.
‘దివాలాకోరు’.. ‘భికారి’.. అన్న తన స్నేహితుడి మాటలు పదే పదే శంకరం హృదయాన్ని గాయపరుస్తుంటే, లేచి మెల్లగా తన గదిలోకి పోయి వాలుకుర్చీలో కూలబడ్డాడు. అతడి మదిలో ఆలోచనల అలజడి మొదలైంది.
భ్రమరకి తెలుసు, తన భర్త ఎప్పుడు మనోవేదనకి గురైనా, పోయి వాలుకుర్చీలో సేదతీరితే కాసేపటికి మామూలు మనిషి అవుతాడని. అందుకే అతడ్ని కదపకుండా ఒంటరిగా వదిలేసింది.
వాలుకుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న శంకరంకి తన చిన్ననాటి జ్ఞాపకాలతో పాటూ ఆరేళ్ళ క్రింత జరిగిన ఓ ముఖ్యమైన సంఘటన పదే పదే గుర్తుకొచ్చింది.
***
ధరణికోట!
గుంటూరు పట్టణానికి దగ్గర్లో చారిత్రాత్మక, ఆధ్యాత్మికతల మేలు కలయికల ఊరే ధరణికోట! శంకరం పుట్టిపెరిగింది అక్కడే. దగ్గర్లోనే ఒకవైపుకష్ణానది పరవళ్ళు.. మరో వైపు పచ్చని పొలాలు. పాడిపంటలకి, కులవృత్తులకి పేరొందిందా ఊరు. కూతవేటు దూరంలో యిటు అమరలింగేశ్వర ఆలయం, మరోవైపు ధ్యానబుద్ధ విగ్రహంతో పాటూ అమరావతి బౌద్ధ మహా స్థూపంతో విరాజిల్లుతోంది. ఓవైపు సూర్యోదయాన్నే పశువులు మేతకోసం పొలాలకి పరుగిడే సమయంలో వీధిలో రేగే గోధూళిని చీల్చుకుంటూ పడే సూర్యరశ్మి ప్రకృతికి వింతరంగులని అద్దితే, మరోవైపు తలపాగాలతో సైకిళ్ళ మీద చెరోవైపు యిత్తడి పాలబిందెలతో కూనిరాగాలు తీస్తూ పాలుపోసే చిరు వ్యాపారస్తుల సందడి అక్కడి జీవనశైలికి అద్దం పడుతోంది. ఎంతో హృద్యంగా వుండే దృశ్యాలతో ఆ అచ్చ తెలుగు పల్లెటూరుని ఒక్కసారి చూస్తే చాలు, ఎవరికైనా చిరస్మరణీయంగా గుర్తుండిపోవలసిందే.
అలాంటి ఊర్లో పుట్టి పెరిగిన శంకరం పదవ తరగతి వరకు, మండల పరిషతఖ సాఠశాలలోనే చదువుకున్నాడు. సొంత గూడు కూడా లేని కులవృత్తి మీద ఆధారపడి జీవించే కుటుంబం నుండి వచ్చిన వాడు కావడంతో అప్పుడే నిశ్చయించుకున్నాడు, ఎప్పటికైన ఈ ప్రాంతంలోనే కొంత స్థలం కూడగట్టుకోవలని.శంకరంకి తన ప్రాంతమన్నా, ఆ ప్రాంత ప్రజలన్నా పిచ్చి ప్రేమ.
గుంటూరులో కాలేజి చదువులప్పుడు శంకరంకి పరిచయమైయ్యాడు వీరభద్రం. ఇద్దరూ చాలా కలివిడిగా వుండేవారు. ముఖ్యంగా మనసులో ఏ మాటని దాచుకోకుండా కుండబద్దలు కొట్టేటట్టు చెప్పే వీరభద్రం నైజం శంకరంకి నచ్చింది. ఏ విషయమైనా దాపరికం లేకుండా ఒకరికొకరు చెప్పుకోందే ఏ పనీ చేసేవారు కాదు. శంకరం మెరిట్‌ విద్యార్ధి కావడంతో చదువు పూర్తవుతూనే బ్యాంక్‌ పి.ఒ. ఎగ్జామ్‌ రాసి మొదటి ప్రయత్నంలోనే ఆఫీసర్‌ ఉద్యోగం సంపాదించాడు. వీరభద్రం మొదటినుండి స్థితిమంతుడు కావడంతో చదువు పూర్తిచేసీ, వ్యాపార నిమ్మితం భాగ్యనగరం బాటపట్టాడు. అలా విడిపోయిన వారు, శంకరం ఆరేళ్ళక్రితం ఏరియా మేనేజర్‌ పదవిని ప్రమోషన్‌ పొంది భ్యాగనగరానికి వచ్చినప్పుడు తిరిగి యిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు మళ్ళీ వారి స్నేహం పరవళ్లుతొక్కింది. ఏ ముఖ్య విషయమైనా, చివరికి సొంత విషయాలు కూడా వీరభద్రంతో చర్చించందే నిర్ణయం తీసుకోడు. శంకరంకి ఆరేళ్ళ క్రితం జరిగిన సంఘటన యిప్పటికీ గుర్తు.
”వీరా..! నాకు మా సొంతూరంటే ఎంత ప్రాణమో నీకు తెలీంది కాదు. ఎప్పటి నుండో నాకు అక్కడ కొంత స్థలం కొనాలనే కోరిక బలంగా వుంది. ఏవో కారణాల వల్ల యిప్పటికీ ఆ పని చెయ్యలేకపోయాను. నా ఉద్యోగం, కూతురి చదువూ అందుకు కారణం కావొచ్చు. అందుకే నేనొక నిర్ణయానికొచ్చా. మా ధరణికోటకి దగ్గర్లో ఓ ఎకరం భూమి అనుకోకుండా అమ్మకానికొచ్చింది. అన్నీ పరిశీలించాక నాకు చాలా నచ్చింది. అందుకే ఆ స్థలం కొనాలని నిశ్చయించుకున్నాను. నీకు తెలీదేంవుంది? రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానిగా కొత్త ప్రభుత్వం ప్రకటించాకా ఇప్పుడా ప్రాంతంలో స్థలాల విలువ అనూహ్యంగా పెరిగిపోయాయి. రెండు, మూడేళ్ళ ముందే అక్కడ స్థలం కొనుంటే బాగుండేది. కానీ అవకాశం రాలేదు. ఇప్పటికైనా మేలుకుని అక్కడ కొంత స్థలం కూడగట్టుకోకపోతే మునుముందు అక్కడ స్థలం కొనడం కలగానే మిగిలిపోతుంది. పెరిగిన ధరల కారణంగా ఎకరం రెండుకోట్లకి వస్తోంది. ఒక విధంగా ఆ ప్రాంతానికి యిప్పుడున్న డిమాండు దృష్యా ఈ ధర తక్కువే. అందుకే కొనాలని నిశ్చయానికొచ్చాను. యిన్నాళ్ళూ నేను దాచిందీ, మా ఆవిడకి ఈ మధ్యే కలిసొచ్చిన పుట్టింటివారి కొంత ధనం కలుపుకోగా, పి.ఎఫ్‌.లోను, వేరే లోన్లుకూడా తీసుకుంటే డబ్బు సమకూరకపోదు. ఇది కొంత సాహసమైన నిర్ణయమే కావొచ్చు కానీ యిప్పుడు ఓ నిర్ణయానికి రాకపోతే ఎప్పటికీ నా కల నెరవేరదు. నువ్వే మంటావ్‌..?” అడిగాడు శంకరం.
”ఇది చాలా పెద్ద విషయం. ఓ విధంగా యిప్పుడు అమరావతి చుట్టుపక్కల స్థలమంటే ఓ స్టేటస్‌ సింబల్‌. మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా. కానీ నా కెందుకో ఆ డబ్బేదో మన భాగ్యనగరం నడిబొడ్డులో ఇండిపెండెంట్‌ ఇంటిపై పెట్టుబడిగా పెడితే బెటరనిపిస్తోంది. నీ స్టేటస్‌కి ఏమాత్రం సూటుకానీ ఎప్పుడో యిక్కడ కొన్న చిన్నడబుల్‌ బెడ్రూమ్‌ యింట్లో ఎడ్జస్ట్‌ అవుతూ ఎన్నాళ్ళని కాలక్షేపం చేస్తావు? ఆలోచించుకో!” అన్నాడు వీరభధ్రం.
”లేదు. యిక ఇల్లూ, స్థలం అంటూ ఏదైనా కొంటే మా ప్రాంతంలోనే కొంటా. లేదంటే ఆ జోలికే పోను. యిది నా స్థిర నిర్ణయం” అన్నాడు శంకరం గట్టిగా.
”అలా అయితే, వచ్చిన అవకాశం వదులుకోకపోవడమే మేలు” అన్నాడు వీరభద్రం.
ఆ తరువాత శంకరం అనుకున్న ప్రకారం అమరావతికి దగ్గర్లో ఎకరం స్థలం కొనుగోలు చేయడం చకచక జరిగిపోయింది.
యిరుకుటుంబాల మధ్యా రాకపోకలు తరచుగా జరుగుతుండటంతో మొదట తమ పిల్లల్ని ఒకటి చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన యిరువైపుల ఆడవారికే కలిగింది. మాటల్లో తమ భర్తల వద్ద పిల్లల పెళ్ళి ప్రస్తావన తెస్తే యిద్దరూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. పెద్దవారి ఉద్దేశాన్ని గ్రహించిన అర్జున్‌, హారికలు కూడా అందుకు తగ్గటుగానే నడుచుకున్నారు.
***
”ఏమండీ..! ఎంతసేపని యిలా ఒంటరిగా వుంటారు? లేచి మొహం కడుక్కోండి. వేడి వేడి కాఫీ తీసుకొస్తా, కాస్త రిలీఫ్‌గా వుంటుంది” అంటూ భ్రమర భర్తని తట్టి లేపడంతో ఈ లోకంలోకి వచ్చాడు శంకరం.
మొహం కడుక్కొచ్చిన భర్తకి వేడి కాఫీ అందిస్తూ- ”ఏంటండీ, యిప్పుడేమై పోయిందని అంతలా బాధ పడతారు? మన అమ్మాయికి ఈ సంబంధం కాకపోతే మరొకటి. ఈపాటిదానికే మీరింత దిగాలు చెందాలా?” అంటూ ధైర్యం చెప్పింది భ్రమర. అప్పుడు మాట్లాడాడు శంకరం.
”ఊు.. ఇన్నాళ్ళూ వీరభద్రం మన సంబంధం కలుపుకోవాలని కోరుకుంటే మా స్నేహనికి విలువిస్తున్నాడని భావించా. మనమన్నా మన కుటుంబం అన్నా వాడికి యిష్టమని తలపోసాను. కానీ ఇవాళ వాడు తేల్చేసాడు, వాడిలో దాగున్నాది సగటు మనిషేనని. అందరిలా వాడూ ఆస్థిపాస్తూలకీ, కట్నకానుకలకే విలువిస్తాడని అనుకోలేదు. ఆ… ఇప్పుడు నాకో విషయం అర్ధమౌతోంది. గత కొన్నినెలలుగా కలుసుకోకపోతే కరోనా పరిస్థితులే కారణమని యిన్నాళ్ళూ అనుకున్నాను. కానీ లోతుగా ఆలోచిస్తే వాడి కంటికి డబ్బు పొరలు కమ్మేయడంతో, రాజధాని తరలింపు ప్రకటన వెలుబడిన వెంటనే నన్ను దూరం పెట్టాడని అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఫోనులో కూడా పొడిపోడిగా మాట్లాడటానికి యిదే కారణం అని యిప్పుడర్ధమౌతోంది. అర్జున్‌ ఊహించని విధంగా ఈ రోజు ప్రపోజ్‌ చేసేసరికి వాడి అసలు రూపు బయటపడింది. ఇలాంటి మనిషినా యిన్నాళ్ళూ నావాడూ అనుకున్నాను? లేదు.. అవసరం లేదు. యిలాంటి స్నేహంగానీ, సంబంధంకాని అవసరంలేదు” నిక్కచ్చిగా చెప్పాడు శంకరం.
భ్రమర మౌనంగా వింటోంది. అక్కడే వున్న హారిక-
”నాన్నా! మీరు బాధపడకండి. నిజం చెప్పాలంటే మీ యిద్దరి స్నేహబంధాన్ని మా సంబంధంతో మరింత బలపరచాలనే మేం ఒకరినొకరు కోరుకున్నాం. అందుకే యిరు కుటుంబాలకి యిష్టమైతేనే ఈ సంబంధం కుదిరేది, లేకపోతే ఎవరిదారి వారిదేనని ముందే మేం నిశ్చయించుకున్నాం. మేమిద్దరం ఒకటవ్వడం ద్వారా మీ స్నేహాన్ని గెలిపించాలనుకున్నామే గానీ మాదేం మనసులు పెనవేసుకున్న ప్రేమ కాదు. ఒక విధంగా చెప్పాలంటే మా మధ్య కలిగింది పరిస్థితులు అనుకూలించిన ఆకర్షణ మాత్రమే! అందుకే అర్జున్ని మరిచిపోవడం నాకు పెద్ద విషయం కాదు. అలాగే అర్జున్‌ కూడా ఈ పెళ్ళి జరగకపోతే గెడ్డం పెంచేసుకుని దేవదాసేం అయిపోడు” తన అభిప్రాయాన్ని నిశ్ఛయంగా చెప్పింది తండ్రితో.
హారిక మాటలు శంకరంలో ధైర్యంతో పాటు ప్రశాంతతని నింపాయి.
***
”నాన్నా! మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి శంకరం అంకుల్ని హర్ట్‌ చేయడమే కాకుండా అతను మీతో ఏదో చెప్పాలని చూస్తే అవకాశమివ్వకుండా లేచి వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు న్యాయం? అంకుల్‌ ఏం చెప్పాలనుకున్నారో తెలుసుకోండి. మా పెళ్ళికి మీరు మనస్పూర్తిగా అంగీకరించకపోతే ఎట్టి పరిస్థితులలో జరగదు. కానీ అంకుల్‌కి ఒక్క ఛాన్స్‌ యిచ్చి అతని మాటేంటో వినండి ప్లీజ్‌. నా కోసం కాదనకండి” రిక్వెస్ట్‌ చేసాడు అర్జున్‌, తండ్రిని.
ఏ కళనున్నాడో యిష్టం లేకపోయినా సరేనన్నాడు వీరభద్రం.
వెంటనే అర్జున్‌, శంకరంతో మాట్లాడి సాయంత్రం అంతా వీడియో కాల్లో కలుసుకుందామని, ఒప్పుకోమని రిక్వెస్ట్‌ చేసాడు. దీనికి శంకరం వెంటనే ఒప్పుకున్నాడు. అందుకు కారణం లేకపోలేదు.
*****
సాయంత్రం అయిదు గంటలు!
గూగుల్‌ డ్యుయో వీడియో గ్రూప్‌కాల్లో యిరుకుటుంబాలు మళ్ళీ కలుసుకున్నాయి. అర్జునే చొరవతీసుకుని కుశల ప్రశ్నల ఆనవాయితీని ముగించాడు. అంత చిన్న స్క్రీన్‌ లోనూ వీరభద్రం అయిష్టంగా చర్చకి కూర్చున్నట్టు చెప్పకనే చెబుతున్నాయి అతడి ముఖకవళికలు.
అప్పుడు అందుకున్నాడు శంకరం.
”వీరా..! ‘మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే!’ అని ఓ విదేశి విజ్ఞుడు చెప్తే యిన్నాళ్ళూ ఏమో అనుకున్నా. కానీ నిజమేనన్న విషయం మొన్న మన మధ్య జరిగిన సంఘటన రుజువుచేసింది. నేను జీవితంలో ఎప్పుడైనా విఫలం చెందానంటే అది నిన్ను అంచనా వేయడంలోనే! అంతరిక్షంలోకి మానవుడు అడుగుపెట్టనా, ఆస్థులూ-అంతస్థులూ లాంటి తారతమ్యాల మధ్యయింకా మనిషి కొట్టిమిట్టాడుతూనే వున్నాడు. అమరావతి దగ్గర్లో స్థలాలు కొన్నవారంతా యిప్పుడు దిక్కుతోచని స్థితిలో వున్న మాట వాస్తవం. నీకు నా ఒక్కడి నష్టమే కనబడుతోంది. కాని అమరావతి అసలు బతుకుచిత్రం నీకు కనబడటంలేదు. గత ఫిబ్రవరి నెలలో నేను ఆఫీసు పని మీద అమరావతి వెళ్ళవలసి వచ్చింది. రాజధాని కొరకు భూములిచ్చిన ప్రజల ఆక్రోశం, ఆవేదనా కళ్ళారా చూసాను. ఒక్కొక్కరి వ్యధ వింటే ఎంత కఠిన హృదయమైనా కరగక మానదు. వేలాది ఎకారాల భూములిచ్చిన రైతులకి చివరికి మిగిలింది కడగండ్లు మాత్రమే” కాసేపు ఆగాడు శంకరం.
అసహనంతో వింటున్న వీరభద్రంతో మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు శంకరం.
”నాకు యిప్పుడు ఒక విషయం నిజమనిపిస్తోంది. బాగా చదువుకున్న నువ్వే, ఆస్థిపాస్తుల మీద ఆశతో, ఎన్నో ఏళ్ళగా కొనసాగుతున్న మన స్నేహబంధాన్ని కూడా దృష్ఠిలో పెట్టుకోకుండా, నా మొత్తం సంపాదనా అమరావతి దగ్గర కొన్న స్థలం మూలంగా మట్టిలో కలిసిపోయిందని నా కూతురిని కాదన్నావు. మరి అమరావతి కొరకు భూములిచ్చి యిప్పుడు సర్వం కోల్పోయిన కుటుంబాల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకోవడానికి, ఎవరు ముందుకొస్తారు? ఈ కారణంగా ఎందరి ఆడపిల్లల పెళ్ళిళ్లు ఆగిపోయాయో ఊహించగలవా? వేలాది ఎకరాలని సునాయాసంగా యిచ్చేసిన వందలాది రైతు కుటుంబాలు మన రాజకీయ పార్టీల వికృత క్రీడలో సమిధలైపోయాయి. ఒక్క పెళ్ళిళ్లేనా..? ఉన్నత చదువుల కోసం, హృద్రోగ చిక్సితల కోసం.. యిలా ఎన్నో అవసరాలకోసం ముందు చూపుతో అక్కడి రైతులేకాకా యితరులు ఎంతో మంది అమరావతిలో పెట్టుబడిగా పెట్టి యిప్పుడు రోడ్డునపడ్డ కుటుంబాల సంఖ్య నాలుగంకెలలోనే వున్నాయి. నేను కళ్ళారా చూసిన ఒకొక్క రైతు దీనగాధని ఏమని చెప్పమంటావు? తొంభైమంది అన్నదాతల ఆత్మహత్య, పదుల సంఖ్యలో రాజధాని తరలింపు వార్తకి ఆగిన గుండెలు.. యిలా వీరి మరణాలని తలచుకుంటే, మనకేం పట్టనట్టు వుండగలామా? అయితే యిందులో మనమేం చెయ్యగలమని అనుకోవచ్చు. కానీ చెయ్యవచ్చు. మనసుంటే ఏదైన చెయ్యొచ్చు. ఏం? తలచుకుంటే, పెళ్ళీడుకొచ్చిన ఓ ఆడపిల్ల కుటుంబంతో మనం సంబంధం కలుపుకోలేమా? ఇదేదో నా కూతురు వరకు వచ్చేసరికి యిలా మాట్లాడుతున్నాననుకోకు. అలాగే, సాధ్యమైన చేయుతనిచ్చి ఓ మంచి విద్యార్ధి వున్నత చదువుల బాధ్యతని తీసుకోలేమా..? ఆగబోయే గుండె శస్త్రచికిత్సకి చేయూత నందించలేమా? వారి బ్రతుకుల్ని అలా దైవానికి వదిలేయడమేనా..? మనలో మనిషి ఏమైపోయాడు? ఆవేశంగా మాట్లాడుతున్న శంకరం తనని తాను నియంత్రించుకునేందుకు కాసేపు ఆగాడు.
”అర్జున్‌లాంటి యువత అమరావతి బాధిత కుటుంబాల్ని ఆదుకునే అవకాశముండే అన్ని మార్గాల్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రచారం చేసి ఒకరి కష్టాలలో ఒకరు పాలుపంచుకునే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలి” ఆగి కాసింత మంచి నీళ్ళు తాగాడుశ ంకరం. మళ్ళీ అందుకుని-
”నేనేదో నీకు నీతి బోధ చేయాలని యిక్కడ కూర్చుని భాషణలివ్వడం లేదు. ముఖ్యంగా నీకు ధన్యవాదాలు చెప్పేందుకే, అర్జున్‌ నీతో మాట్లాడమంటే అంగీకరించాను. అర్జున్‌ ప్రపోజల్‌ తెరమీదకి రావడంతో నీవేంటో నాకర్ధమైంది. నీ తిరస్కారమే, నాలో అసలైన మనిషిని నిద్రలేపింది. నా ప్రాంత ప్రజలని అంతో యింతో అవకాశమున్న నేను కూడా ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని తెలుసుకున్నాను. అందుకే నేనోక నిశ్చయానికొచ్చా. అమరావతి బాధిత కుటుంబాలకి ఆపన్న హస్తం అందించి తీరాలని తీర్మానించా. న ాపొదుపులో ప్రతి రూపాయిలో ఓ యాభైపైసలు బాధిత కుటుంబాల ఆడపిల్లల పెళ్ళి ఖర్చులకీ, వారి ముఖ్యమైన యితర అవసరాలకి వినియోగించడానికి నిర్ణయించా” మళ్ళీ ఆగాడు శంకరం.
”ఆ…యిప్పుడు నీ దగ్గరేముంది? బూడిద!” గొణుగుతూ వెటకారంగా అన్న వీరభద్రంమాట శంకరంతో పాటూ అందరికీ స్పష్టంగా వినిపించింది.
”హు…నీలో మార్పునాశించడం నాదే తప్పు. ఆఖరి మాట విను!” అంటూ ఒక్క క్షణం ఆగాడు శంకరం.
వీరభద్రం అనాసక్తిగానే వింటున్నాడు.
”వీరా..! ఏప్రభుత్వమైనా తీసుకోబోయే కీలకమైన, ముఖ్యంగా ఆర్థికపరంగా తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయాలు ఒక్కొక్కసారి మా బ్యాంకింగ్‌ సర్కిల్లో ముందుగా లీకవుతుంటాయి. నా అదృష్టమో, ఏమో.. రాజధాని తరలింపు ప్రకటన రాక ముందే ఆ విషయం నాకు తెలియడంతో, అప్పటికప్పుడే నేను అమరావతి దగ్గర కొన్న ఎకరం పొలం రెండింతల లాభానికి అమ్మి జాగ్రత్త పడ్డాను. ఇది చాలా కాన్ఫిడెంషియల్‌ మేటర్‌ కావడంతో అన్ని ముఖ్యమైన విషయాలూ నీతో చర్చించి నిర్ణయం తీసుకొనే నేను, ఈ విషయంలో మిన్నకున్నాను. అదే మంచిదైంది. నీ అసలు రూపు బయటపడటానికి బాటలు వేసింది. ఇదే నీకు చెప్పదలచుకున్న ఆఖరి ముక్క” అంటూ వీడియో కాల్‌ నుండి ఎగ్జిట్‌ అయ్యాడు శంకరం.
శంకరం చెప్పిన నిజానికి వీరభద్రం పరిస్థితి దారుణంగా తయారైయింది.
– కారంపూడి వెంకట రామదాస్‌,
9393232939