– ఎన్నికల సాధారణ పరిశీలకులు: డా. సంజయ్ జి.కోల్టే
నవతెలంగాణ-పాల్వంచ
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధులు నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు డా.సంజయ్ జి. కోల్టే అన్నారు. శనివారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్, వ్యయ పరిశీలకులు, శంకర ఆనంద్ మిశ్రా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ రోహిత్ రాజ్‌లతో కలిసి సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ.. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలన్నారు. శాఖలు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. పోలింగ్, ప్రచారం, వ్యయ పర్యవేక్షణ బృందాలు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్ మాట్లాడుతూ నిఘా పకడ్బందీగా చేపట్టాలని, సీజర్‌లపై దృష్టి పెట్టాలని అన్నారు. వ్యయ పరిశీలకులు శంకర ఆనంద్ మిశ్రాలు మాట్లాడుతూ వ్యయ పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజర్‌ల విషయంలో నియమ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లా ఎన్నికలఅధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లను గురించి వివరించారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, నోడల్ ఆఫీసర్లు, ఎన్నికల సూపర్డెంట్లు ధారా ప్రసాద్, పాల్గొన్నారు.