పొద్దున లేస్తే అబద్ధాలే…

– కేసీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పటం ఆనవాయితీగా మారిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ పర్యటన సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట్లో విద్యుత్‌ సరఫరాలో పలుమార్లు అంతరాయం కలిగిందనే వార్తల్లో వాస్తవం లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మాజీ సీఎం చెప్పినదాంట్లో వాస్తవం లేదన్నారు. కేసీఆర్‌ ప్రకటనపై స్పందించి, స్థానిక విద్యుత్‌ అధికారులతో విచారణ చేయించగా, ఎలాంటి పవర్‌కట్‌ లేదనే విషయం తేలిందని స్పష్టం చేశారు. శ్రీనివాసగౌడ్‌ ఇంట్లోని డిజిటల్‌ మీటర్‌ ద్వారా ఏరియా ట్రాన్స్‌ఫార్మర్‌ రీడింగ్‌ను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. గతంలో సూర్యాపేటలో పర్యటించినప్పుడు కూడా కేసీఆర్‌ ఇలాంటి అబద్ధాలనే వల్లే వేశారని భట్టి విమర్శించారు.