– ఏడాదిలో 69వేల మందికి ఉద్వాసన
– టాప్4 కంపెనీలో భారీగా కుదింపులు
– కొత్త నియామకాలకు విముఖత..!
న్యూఢిల్లీ : ఒకప్పుడు భారీగా డిమాండ్ ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగాలు ఇప్పుడు గాల్లో దీపంలా మారాయి. ఉన్న కొలువులపై వేటు పడుతుండగా.. మరోవైపు కొత్త నియామకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. గడిచిన ఒక్క ఏడాదిలోనే భారత్‌కు చెందిన అగ్రశ్రేణీ నాలుగు ఐటీ కంపెనీల్లో దాదాపు 70వేల ఉద్యోగాలు క్షీణించడమే ఇందుకు నిదర్శనం. దిగ్గజ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా కంపెనీలు క్రితం ఆర్థిక సంవత్సరం 2023-24నకు సంబంధించిన ఆర్థిక ఫలితాలను వెల్లండించాయి. ఈ సందర్బంగా ఉద్యోగుల సంఖ్యను వెల్లడించగా.. గడిచిన ఏడాదిలో నికరంగా 69,000 సిబ్బంది తగ్గినట్లు వాటి గణంకాల్లో వెల్లడయ్యింది. కాగా ఒక్క హెచ్‌సిఎల్‌లో మాత్రమే నికరంగా ఉద్యోగుల సంఖ్య 1,537 మేర పెరిగింది. దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టీసీఎస్‌లో ఒక్క ఏడాదిలోనే 13,249 మంది ఉద్యోగులు తగ్గి.. 2024 మార్చి ముగింపు నాటికి 6,01,546కు కుదించబడ్డారు. రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖ్య 3,43,234 నుంచి 3,17,240కి క్షీణించింది. ఈ కంపెనీలో ఏడాదిలోనే 25,994 మంది కోత పడ్డారు. మరో దిగ్గజ ఐటీ కంపెనీ విప్రోలో 2023 మార్చి ముగింపు నాటికి 2,58,570 మంది సిబ్బంది ఉండగా.. ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి 2,34,054కు కుదించబడ్డారు. దీంతో ఒక్క ఏడాదిలోనే 24,516 మంది ఉద్యోగులు తగ్గారు. టెక్ మహీంద్రాలోనూ నికరంగా 6,945 ఉద్యోగులు కుదించ బడ్డారు.దేశీయ, అంతర్జాతీయంగా నెలకొన్న మందగమనం సంకేతాలు ఐటీ కంపెనీలను బెంబేలెత్తిస్తున్నాయి.కాగా.. కంపెనీల రెవెన్యూ,లాభాలు భారీ గా పెరిగినప్పటికీ పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందికి ఎసరు పెట్టడం గమనార్హం. ఇకపై మరింత తక్కువ వేతనాలకు ఫ్రెషర్లను తీసుకోవాలని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సుమారు 40 వేల మందిని, హెచ్‌సిఎల్ 10 వేల మంది, టెక్ మహీంద్రా 6 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించడం అభ్యర్థులకు కొంత ఊరట కలిగించే అంశం. అయితే ఇప్పటికిప్పుడే నియామకాలు ఉండ కపోవచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో పెద్దగా డిమాండ్ లేకపోవడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఐటీ సర్వీ సులకు గిరాకీ తగ్గింది. మరోవైపు అన్ని కంపెనీలు పొదుపు చర్యలకు దిగి నట్లే ఐటీ సంస్థలు అదే బాటలో నడుస్తున్నాయని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.