నిధులున్నా..ఖర్చుచేయని ఎంపీలు

నిధులున్నా..ఖర్చుచేయని ఎంపీలు– ఎంఓఎస్‌పీఐ డేటా
న్యూఢిల్లీ : 2019లో పార్లమెంటుకు ఎన్నికైన ఎంపీలు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీల్యాడ్‌) కింద వారికి కేటాయించిన నిధులను వినియోగించలేదని వెల్లడైంది. 2014లో ఎన్నికైన ఎంపీలు కూడా ఆ నిధులను వినియోగించలేదని స్పష్టమైంది. ఈ పథకం కింద ఖర్చు చేయని నగదు 2014-19 (8.7 శాతం)తో పోలిస్తే.. ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే నాటికి రెండింతలు పెరిగి 16 శాతానికి చేరాయని పేర్కొంది. ఏప్రిల్‌ 2024 వరకు స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐ) డేటా ప్రకారం మొత్తం రూ.5,185 కోట్లు జిల్లా యంత్రాంగ ఖర్చు చేయాల్సి వుండగా, రూ.842 కోట్లు ఇప్పటికీ ఖర్చు చేయలేదని తేలింది. కరోనా సమయంలో ఈపథకం దాదాపు 18 నెలలు నిలిపివేయబడినప్పటికీ.. మొత్తం నగదులో ఖర్చు చేయని నగదు వాటా మూడు రెట్లు పెరిగింది. 2014-19లో రూ.12,945 కోట్లు విడుదల చేయగా, కరోనా తర్వాత ఈ పథకానికి ప్రభుత్వం విడుదల చేసే నిధులు సగానికి పైగా తగ్గాయి.
15వ లోక్‌సభతో (2004-09) పోలిస్తే.. మొత్తం కేటాయించిన నిధులు (రూ.10,926) కాగా, వాటిలో ఖర్చు చేసింది (రూ.379 కోట్లు ) కేవలం 3.4 శాతం మాత్రమేనని తేలింది.
ప్రతిఏడాది ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యునికి వారి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ. 5కోట్లు కేటాయిస్తుంది. తమ నియోజకవర్గాల్లో నిర్వహించాలనుకుంటున్న అభివృద్ధి పనులను చేపట్టాల్సిందిగా ఎంపీలు జిల్లా యంత్రాంగానికి లేఖ రాస్తారు. 2019లో ఎన్నికై న ఎంపీలు వారి నియోజకవర్గాల్లో కేవలం 96.3 శాతం నిధులనుమాత్రమే వినియోగించినట్టు నివేదిక స్పష్టం చేసింది. 15వ లోక్‌సభ (102.7) శాతం నిధులు వినియోగించగా, 16వ లోక్‌సభ 99 శాతం నిధులను వినియోగించింది.హర్యానా కేవలం (74 శాతం) అత్యంత తక్కువ నిధులను వినియోగించగా, జమ్ముకాశ్మీర్‌ (77.5 శాతం), తెలంగాణ (78శాతం), పశ్చిమబెంగాల్‌ (80శాతం) నిధులను ఖర్చు చేశాయి. ఏపీ 131 శాతం, గుజరాత్‌ 109 శాతం, కర్నాటక 107.9 శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌ 105 శాతం ఖర్చు చేసినట్టు నివేదిక తెలిపింది.