చేనేతపై 12శాతం జీఎస్టీ విధించింది బీజేపీనే..

BJP imposed 12 percent GST on handloom.– కేటీఆర్‌ పద్మశాలీలను రాజకీయంగా వాడుకున్నారు
– నేత కార్మికుడి కుటుంబానికి అండగా ఉందాం.. గత ప్రభుత్వం వల్లే వస్త్ర పరిశ్రమలో సంక్షోభం
– ఎలక్షన్‌ ముగిసిన తర్వాత కార్మికులకు కొత్త పాలసీ తీసుకొస్తాం
– తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి
నవతెలంగాణ – సిరిసిల్ల
చేనేత గుడ్డపై 12శాతం జీఎస్టీ విధించింది బీజేపీ ప్రభుత్వమేనని, బీజేపీ-బీఆర్‌ఎస్‌ శవ రాజకీయాలు చేస్తున్నాయి.. పదేండ్లలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు పద్మశాలి కమ్యూనిటీకి ఏమీ చేయలేదని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ అన్నారు. సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి మండల కేంద్రంలో నేత కార్మికుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో శనివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దీపాదాస్‌ మున్షీ మాట్లాడారు. పదేండ్లుగా పని చేయించుకొని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడం వల్ల నేడు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఎవరూ అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని చెప్పారు. సిరిసిల్లలో 27వేల పవర్‌లూమ్స్‌ ఉన్నాయని, చాలా కుటుంబాలు వస్త్ర పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నేత కార్మికులకు పనులు కల్పించినా.. సంబంధించిన బిల్లులు చెల్లించలేదని అన్నారు. దీనివల్ల పవర్‌లూమ్స్‌ పరిశ్రమ కొద్దిరోజులు మూతపడిందన్నారు. రూ.26వేల పవర్‌లూమ్స్‌ ఉన్న సిరిసిల్లలో నేత కార్మికులకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలూ రూపొందించలేదని విమర్శించారు. కేటిఆర్‌ పద్మశాలీలను కేవలం రాజకీయంగా వాడుకున్నారన్నారు.
బతుకమ్మ చీరల బకాయి బిల్లులు గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పాపమేనన్నారు. నాలుగు నెలల్లో ఐదుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికుల కోసం కొత్త పాలసీ తీసుకొస్తుందని వెల్లడించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ శవరాజకీయాలు మానుకుని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ముందుకురావాలని హితవు పలికారు.
ఉత్పత్తి పెంపు.. అధిక పని కల్పిస్తాం.. : మంత్రి పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. నేతన్నల ఆత్మహత్యలు దురదృష్టకరమన్నారు. రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చని, ముందు నేతన్నలకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేద్దామని అన్నారు. గతంలో నేతన్నలకు ఉన్న రూ.12వేల అంత్యోదయ కార్డులను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. అవి ఉంటే ఇప్పుడు 35 కిలోల బియ్యం వచ్చేవి కదా అని అన్నారు. జీఓ నంబర్‌-1 ద్వారా బట్టల ఆర్డర్‌ ఇవ్వడానికి గతంలో కంటే అదనంగా ఇచ్చేలా తమ పాలసీ ఉంటుందని, ఎన్నికల కోడ్‌ ఉండటం వల్ల ఆగిపోయిందని, ప్రభుత్వం మంచి పాలసీ తీసుకోవడానికి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఉత్పత్తి పెంచి కార్మికులకు అధిక పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నాలుగు నెలల తమ పాలనలో ఈ ఆత్మహత్యలు జరగలేవని, బీఆర్‌ఎస్‌ పాలనలో సరైన విధానాలు లేక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. యజమాని, ఆసామి, కార్మికులు మూడు అంచెల వ్యవస్థ సిరిసిల్లలో ఉందని, ఇప్పటికే నేత కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్‌ ఇండియా కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ రోహిత్‌ చౌదరి, విష్ణు నాథ్‌ మానకొండూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనా రాయణ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కెకె మహేందర్‌ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.