నవతెలంగాణ – సిద్దిపేట
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు మే2 లోగా చెల్లించాలని సిద్ధిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆర్. సూర్యప్రకాష్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 2 వరకు అవకాశం ఉందన్నారు. చివరి వారంలో పరీక్షలు ఉన్నందున, సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును పొడిగించే అవకాశం ఉండబోదన్నారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ విషయాన్ని గమనించి పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థుల కళాశాల ప్రిన్సిపాల్స్, సంబంధిత సబ్జెక్టుల లెక్చరర్లు ఆయా విద్యార్థులకు సమాచారం ఇచ్చి, పరీక్ష ఫీజు చెల్లించేలా చూడాలని సూచించారు.