రాజీనామా వెనుక..?

రాజీనామా వెనుక..?– ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికిఅర్విందర్‌సింగ్‌ గుడ్‌బై
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ యూనిట్‌ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్‌ లవ్లీ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలిపారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీతో భాగస్వామ్యానికి తాను వ్యతిరేకమని చెప్పారు. ముగ్గురు లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఢిల్లీ కాంగ్రెస్‌ కమిటీ అభిప్రాయాలను పార్టీ హైకమాండ్‌ తిరస్కరించి, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కాంగ్రెస్‌ ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ బహిరంగంగా ప్రశంసించడం సరికాదని అన్నారు. కాంగ్రెస్‌ ఢిల్లీ యూనిట్‌ అధ్యక్షుడిగా లవ్లీ 2023 ఆగస్టు నుంచి బాధ్యతల్లో ఉన్నారు.
అయితే దీని వెనుక కమలం పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.