– ఇండిపెండెంట్లను బరిలోంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల యత్నాలు
– సోమవారం రాత్రి వరకు వెల్లడి కానున్న తుది జాబితా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో లోక్‌సభ నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. పరిశీలన అనంతరం 625 మంది అభ్యర్థులకు చెందిన 1,060 నామినేషన్ సెట్లను అనుమతించారు. మొత్తం 17 నియోజక వర్గాలకు గాను 7 స్థానాల్లో 40 మందికి పైగా పోటీలో ఉన్నారు. మెదక్‌లో అత్యధికంగా 53 మంది, ఆ తర్వాత భువనగిరి 51,పెద్దపల్లి 49, వరంగల్ 48, సికింద్రాబాద్, చేవెళ్లలో 46, ఖమ్మంలో 41 మంది బరిలో ఉన్నారు. ఈ స్థానాల నుంచి ఎక్కువ మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయా స్థానాల్లోని ఇండిపెండెంట్లు పోటీనుంచి తప్పుకునేలా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉపసంహరణల అనంతరం సోమవారం రాత్రి వరకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడి కానుంది.