నవతెలంగాణ – హైదరాబాద్
తనపై తప్పుడు అభియోగాలపై హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలంటూ హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కె.మాధవీలత హైకోర్టు లో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించాక రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారనీ, ఈనెల 17న శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా ఒక మత మందిరంపై బాణం గురిపెట్టి రెచ్చ గొట్టేలా వ్యవహరించారంటూ నగరాని కి చెందిన షేక్ ఇమ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.బేగంపేట పోలీసులు ఈనెల 20న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది.
ఎక్సైజ్ అధికారుల బదిలీలకు ఉత్తర్వులివ్వలేం
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మూడేండ్ల పదవీ కాలం పూర్తి చేసిన ఎక్సైజ్ అధికారులను బదిలీ చేయాలన్న ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల విధులతో సంబంధం లేని వాళ్లను బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఈసీ చెప్పిన జవాబును ఆమోదించింది. ఎక్సైజ్ ఆఫీసర్లను బదిలీ చేయకపోతే మద్యం ఏరులైపారే అవకాశం ఉందంటూ స్థానిక తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి బొందిలి నాగాధర్ సింగ్ పిల్ దాఖలు చేశారు. దీన్ని డిస్మిస్ చేస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన డివిజన్ సోమవారం తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో మద్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.
తీర్పు వాయిదా
తనను అన్యాయంగా రెండున్నర ఏండ్లకుపైగా సుమారు 32 నెలలుగా జైల్లో పెట్టడం చట్ట వ్యతిరేకమనీ, రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొంటూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్‌యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఆయన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ కె లక్ష్మణ్ విచారణను పూర్తి చేశారు. ఇరపక్షాల వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.