ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ

– తిండి, బట్ట, పెళ్లి మీదా ఆంక్షలు
– మోడీకి సాగిలపడిన చంద్రబాబు, జగన్‌ : బివి రాఘవులు
తిరుపతి : దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బీజేపీి ధ్వంసం చేస్తోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే దేశం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి, జనసేన, వైసిపి… బీజేపీి పక్షానే ఉన్నాయని వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పోటీ ఇండియా వేదిక, బీజేపీి మధ్యేనని పేర్కొన్నారు. ‘ఎన్నికలు-వర్తమాన పరిస్థితి’పై తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సదస్సుకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ ముస్లిముల రిజర్వేషన్లు తీసేస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీి ప్రకటిస్తే… టిడిపి, వైసిపిలు వ్యతిరేకించకపోవడం శోచనీయమన్నారు. పౌరసత్వ చట్టసవరణ పేరుతో దేశవ్యాప్తంగా ఒకే మతం, ఒకే యూనిఫారం, ఒకే ఫుడ్‌ అనేలా బీజేపీి వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆఖరికి తిండి, బట్ట, పెళ్లిమీద కూడా ఆంక్షలు విధిస్తోందని, ప్రజల జీవితాన్ని, ఇంటిని కూడా నియంత్రిస్తోందని వివరించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీి ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను తుంగలో తొక్కిందని గుర్తు చేశారు.