మతోన్మాదుల చర్యలకు భయపడేది లేదు

వరంగల్‌లో రచయితలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం డిమాండ్‌
నవతెలంగాణ-బంజారా హిల్స్‌
మతోన్మాదుల చర్యలకు భయపడేది లేదని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు పాటుపడుతున్న రచయితలపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం డిమాండ్‌ చేసింది. సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు డాక్టర్‌ ఏకే ప్రభాకర్‌, స్కైబాబా, పసునూరి రవీందర్‌, భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాజకీయాల్లోకి మతాన్ని జొప్పిస్తున్న అంశంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సాహిత్య రచయితలు కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ”లౌకిక విలువలు-సాహిత్యం” అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది రచయితలు, కవులు పాల్గొన్నారన్నారు. సమావేశం కొనసాగుతుండగా కొందరు యువకులు అక్రమంగా ప్రవేశించి ప్రగతిశీల అభ్యుదయ రచయితలను, మేధావులను అశ్లీల పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశ అనంతరం పసునూరి రవీందర్‌, నరేష్‌ కుమార్‌, సూఫీ, భూపతి వెంకటేశ్వర్లుపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాక మెర్సీ మార్గరెట్‌ అనే మహిళారచయితను అసభ్య పదజాలంతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగంగా పేరొందిన భారత రాజ్యాంగ విశిష్టత తెలియని మూర్ఖులకు తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రచయితలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.