– రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
– పలు రేషన్ షాపులు, హౌటళ్లలో పరిశీలన
నవతెలంగాణ-ఆమనగల్
చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ బియ్యాన్ని లబ్దిదారులకు సకాలంలో, సక్రమంగా అందించేలా అధికారులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యతతో కూడుకున్న ఆహారం అందించాలన్నదే కమిషన్ ధ్యేయమని ఆయన పేర్కొ న్నారు. అమనగల్ మండల కేంద్రంలో మంగళవారం గోలి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పలుచోట్ల రేషన్ దుకాణాలు, హౌటళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆహార పదార్థాల విక్రయాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆహార పదార్థాలను కల్తీ చేసి విక్రయిస్తే నిబంధనల మేరకు కఠిన చర్యలు తప్పవన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆహార పదా ర్థాలు, నిత్యావసర సరుకుల విక్రయానికి సంబంధించి విధిగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా కల్తీకి తావు లేకుండా ఫుడ్ కమిషన్ ద్వారా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు రూప వెంకట్ రెడ్డి, దశరథ్ నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, మహమ్మద్ జహంగీర్, కొమ్ము ప్రసాద్, చలిచీమల సతీష్ తదితరులు పాల్గొన్నారు.