ఓయూ సమస్యలను పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లోని త్రాగునీరు, భోజనం సమస్యలను పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నత చదువులకు నిలయమైన ఓయూలో మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. గత పది రోజులుగా విద్యార్థినీల వసతి గృహాల్లో నీటి కొరత తీవ్రంగా ఉన్నా అధికారులు సరిగ్గా పట్టించుకోకుండా వ్యవరించారని తెలిపారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇంత తీవ్రమైన ఎండల్లో సుమారు 700 మంది విద్యార్థినీలు ఉంటున్న ఒక వసతి గృహంలో కేవలం ఒక రిఫ్రిజిరేటర్‌ ఉందని పేర్కొన్నారు. అక్కడే ఉన్న మిగతా రెండు హాస్టళ్ల విద్యార్థులు కూడా ఇదే రిఫ్రిజిరేటర్‌పై ఆధారపడడం వల్ల రోజురోజుకూ సమస్య మితిమీరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి విద్యార్థులు అనేక సార్లు నిరసనలు తెలిపినా, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కార చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ సమస్యలన్నిటికీ కరెంట్‌ సరఫరా లేకపోవడాన్ని కారణంగా చూపుతూ కాలక్షేపం చేస్తున్నారని తెలిపారు. జూన్‌ రెండో వారం నుంచి పీజీ విద్యార్థులకు నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (జాతీయ అర్హత పరీక్ష)ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ఈ సమయంలో విద్యార్థులు హాస్టల్లోనే ఉంటూ పరీక్షకు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. దీన్ని అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఎండా కాలాన్ని కారణంగా చూపి హాస్టళ్లను ఖాళీ చేయమనంటున్నారని తెలిపారు.
దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. గతంలో సికింద్రాబాద్‌ పీజీ కళాశాల, కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు ఈ తరహానే ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. వర్సిటీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.