ఇది నయవంచక పాలన …!

This is a tyrannical regime...!– మోడీ ఏలుబడిలో మహిళల బతుకులు దుర్భరం
– పెరిగిపోతున్న లైంగిక వేధింపులు, హింస, అవమానాలు
– రాజకీయ రిజర్వేషన్లపై దాటవేత… మహిళా బిల్లుపై మౌనం
– మైనారిటీ మహిళల అభివృద్ధికి చట్టం అవసరం
– వారిది ఆది నుండీ పురుషాధిక్య సిద్ధాంతమే
నరేంద్ర మోడీ పాలనలో మహిళల బతుకులు దుర్భరంగా మారాయి. వారిపై అకృత్యాలు, అఘాయిత్యాలు, దాష్టీకాలు నానాటికీ పెరిగిపోయాయి. బీజేపీ నాయకులే ఈ అమానుష చర్యలకు తెగబడుతున్న ఉదంతాలు కోకొల్లలు. పురుషాధిక్య సిద్ధాంతాన్ని ప్రవచించే బీజేపీ నేతలు మహిళలు చెప్పు కింద తేలు మాదిరిగా పడి ఉండాలని కోరుకుంటున్నారు. ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా పచ్చి మోసానికి పాల్పడుతున్నారు. లైంగిక మైనారిటీల హక్కులను కూడా కాలరాయాలని చూస్తున్నారు.
న్యూఢిల్లీ :‘మహిళా సమ్మాన్‌’, ‘బేటీ బచావ్‌…బేటీ పడావ్‌’ వంటి నినాదాలతో మహిళా లోకాన్ని ఆకర్షించి వారి ఓట్లను కొల్లగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉద్యోగావకాశాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తానని ఊరించింది. లైంగిక మైనారిటీల అభివృద్ధికి చట్టాన్ని తీసుకొస్తానంటూ తీయని కబుర్లు చెప్పింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలన్నింటినీ గాలికి వదిలేసింది. వాస్తవానికి మోడీ ప్రభుత్వ పాలనలో మహిళల బతుకులు మరింత దుర్భరమయ్యాయి. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు నిత్యకృతమయ్యాయి.
మోయలేని భారం
కుటుంబ బాధ్యతలను మోస్తున్న మహిళలపై ద్రవ్యోల్బణం కారణంగా తీవ్రమైన ఒత్తిడి కలుగుతోంది. నిరుద్యోగం, వలసలు పెరిగిపోతుండడంతో మహిళలపై బాధ్యతల భారం పెరుగుతోంది. చాలీచాలని వనరులతో కుటుంబ బాధ్యతలను తలపై వేసుకోవాల్సి రావడంతో మహిళలు పౌష్టికాహారలోపంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రపంచంలోని 126 దేశాల్లో పౌష్టికాహారలోపంపై అధ్యయనం నిర్వహించగా భారత్‌ 107వ స్థానంలో నిలిచింది.
ఉద్యోగాలు లేవు… ఉన్నా వేతనాలు అంతంతే
ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోతోంది. ఒకవైపు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతుంటే మరోవైపు ఉన్న ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పడిపోతోంది. మహిళలు ఎక్కువగా అనధికారిక, అసంఘటిత రంగాల్లో పనిచేస్తుంటారు. దీంతో వారికి అత్యంత తక్కువగా వేతనాలు లభిస్తున్నాయి. సేవలకు సంబంధించిన రంగాల్లో మహిళలు ఎక్కువగానే పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు వారిని అగౌరవపరిచేలా ఉంటున్నాయి. వీరికి సగటున నెలకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే లభిస్తున్నాయి.
పెచ్చరిల్లిన దాష్టీకాలు
గడచిన పది సంవత్సరాల కాలంలో అంటే మోడీ ప్రభుత్వ హయాంలో మహిళలపై లైంగిక వేధింపులు, హింస, దూషణలు పెరిగిపోయాయి. 2011లో ఇలాంటి కేసులు 2,28,650 నమోదు కాగా 2022 నాటికి ఆ సంఖ్య 4,28.278కి పెరిగింది. అంటే ఈ తరహా కేసుల సంఖ్య గణనీ యంగా పెరిగిపోయిందని అర్థమవు తోంది. ‘ఇండియా స్పెండ్‌’ అనే సంస్థ నిర్వహించిన ఓ అధ్య యనం ప్రకారం గత ఐదు సంవత్సరాల కాలంలో లింగ మైనారిటీలపై హింసాత్మక ఘటనలు నాలుగున్నర శాతం పెరిగాయి.
రాజకీయ రిజర్వేషన్లు ఏవి?
రాజకీయ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటన చేసినప్పటికీ దాని అమలును 2034 వరకూ వాయిదా వేశారు. ఇలా చేయడం ఎన్నికల సమయంలో మహిళలను మోసం చేయడమే అవుతుంది. కాగా లైంగిక మైనారిటీలు వ్యతిరేకించినప్పటికీ ట్రాన్స్‌జెండర్‌ చట్టాన్ని, నిబంధనలను శాసనసభలో ఆమోదించారు.
బీజేపీ నేతలూ దోషులే
మహిళలపై బీజేపీ నేతలు వేధింపులకు పాల్పడిన కేసులు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఉన్నావ్‌ కేసులో కుల్‌దీప్‌ సింగ్‌ సహా ఆరుగురు బీజేపీ సభ్యులకు ప్రమేయం ఉంది. ఓ చిన్నారిపై ఆటవికంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన కేసులో ఏడుగురు బీజేపీ అనుబంధ వ్యక్తులు నిందితులు. గుజరాత్‌లో వెలుగు చూసిన బిల్కిస్‌ బానో కేసులో బీజేపీతో సంబంధమున్న ఏడుగురు వ్యక్తులు దోషులుగా తేలారు. మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం దేశంలో పెను సంచలనమే రేపింది. వీరందరికీ బీజేపీ బాసటగా నిలిచింది. వారికి బహిరంగంగా మద్దతు తెలిపింది. పైగా వారిని ప్రశంసించింది కూడా. మణిపూర్‌లో మహిళలను బహిరంగంగా వేధించి అవమానిస్తే ప్రధాని మోడీ మౌనం వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలపై లైంగిక వేధింపులు, నేరాలకు పాల్పడే దుండగులు ఎందుకు భయపడతారు?
మహిళా బిల్లుపై మోసం
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంటులో అంగీకారం తెలిపిన తర్వాత, ప్రజల నుండి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో దానిని అమలు చేస్తానని నమ్మబలికిన తర్వాత బీజేపీ తన వైఖరిని మార్చుకుంది. అది కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత. 2034 తర్వాతే బిల్లును అమలు చేస్తానని చెప్పి చివరికి ప్రజలను మోసం చేసింది.
వారిది పురుషాధిక్య సిద్ధాంతం
బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ ప్రాథమికంగా పురుషాధిక్యతను కోరుకుంటాయి. అంబేడ్కర్‌ ప్రతిపాదించిన హిందూ కోడ్‌ బిల్లు వంటి మహిళల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన బిల్లులను సైతం వ్యతిరేకించిన చరిత్ర వాటికి ఉంది. మహిళలు పురుషుల అధీనంలో ఉండాలని, పిల్లలను సాకడం, పెంచడమే వారి ఏకైక బాధ్యత అని అవి సిద్ధాంతీకరించాయి.
మైనారిటీ మహిళలపై చిన్నచూపు
మైనారిటీ మహిళల హక్కులకు ‘నల్సా తీర్పు’ ఓకే చెప్పింది. ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే దానిని అమలు చేయాల్సిన ప్రభుత్వం, లోక్‌సభలో బిల్లును ఆమోదించి అందుకోసం అంగీకారం పొందింది. అయితే దానికి ఇప్పటి వరకూ రాజ్యసభ ఆమోదం లభించ లేదు. మైనారిటీ మహిళలకు చెందిన సంఘాలన్నీ దీనిని వ్యతిరేకించాయి. ఎందుకంటే లింగ గుర్తింపును ప్రభుత్వ అధికారులే సరిచూడాలని అవి డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వ చర్య మైనారిటీ మహిళలను కించపరిచేలా, వారిని అణచివేసేలా ఉంది. అంతేకాక వివాహం, దత్తత, వారసత్వ ఆస్తికి సంబంధించి ఆ తరగతికి చెందిన వారికి ఉన్న హక్కులను ఈ బిల్లు తోసిపుచ్చుతోంది. మహిళలు, లైంగిక మైనారిటీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ వాస్తవానికి వారిని వంచిస్తోంది. వారి జీవితాలను అణచివేస్తోంది.