మైనారిటీ గురుకులంలో పాలిట్రిక్స్‌!

In minority Gurukulam Politrix!– డిప్యూటీ సీఎంకి ఓ ఇద్దరు లెక్చరర్ల బురిడీ
– బెదిరించి విద్యార్థుల చేత ఓ అధ్యాపకురాలిపై ఫిర్యాదు
– మైనారిటీ సొసైటీకి సైతం తప్పుడు నివేదికలు..!
– విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు..
– మానసిక క్షోభతో బాధిత లెక్చరర్‌ అనారోగ్యం పాలు
– విషయం బయటకు రాకుండా ప్రిన్సిపాల్‌, ఆర్‌ఎల్‌సీ జాగ్రత్తలు!
– ఇదీ అశ్వారావుపేట మైనారిటీ గురుకుల కళాశాల తీరు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అశ్వారావుపేట మైనారిటీ గురుకుల కళాశాలలో పని చేసే ఇద్దరు లెక్చరర్లు ఏకంగా డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కనే బురిడీ కొట్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌)ని సైతం తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తోంది. తమ స్వార్దం కోసం విద్యార్థులను బెదిరించి డిప్యూటీ సీఎంకు తప్పుడు కంప్లయింట్స్‌ రాయించారని సమాచారం. తాము చెప్పినట్టు చేయకపోతే ప్రాక్టికల్‌ మార్కులు వేయమని విద్యార్థినులను బెదిరించినట్టు విచారణలో వెలుగు చూసింది. ఈ ఘటనతో బాధిత లెక్చరర్‌ మానసిక క్షోభతో తీవ్ర అనారోగ్యానికి గురై.. కొద్దిరోజుల పాటు కోమాలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుండటంతో అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. దాంతో విషయం బయటకు రాకుండా ప్రిన్సిపాల్‌, ఆర్‌ఎల్‌సీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.
ఏమి జరిగింది..
అశ్వారావుపేట మైనారిటీ గురుకుల కళాశాలలో తెలుగు లెక్చరర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న కవితపై వ్యక్తిగత కక్షతో అదే కళాశాలలో ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌ లెక్చరర్లు పి.స్వప్న, బి. నీరజ కళాశాలలో కొంతమంది ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్దినులతో జనవరి 6న డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేయించారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కవిత తమను వేధింపులకు గురిచేస్తోందని, అనరాని మాటలు అంటోందని తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని భట్టివిక్రమార్కకు విద్యార్థినుల చేత లేఖ రాయించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం లెక్చరర్‌ కవితపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీఎంఆర్‌ఈఐఎస్‌ను ఆదేశించారు. దాంతో రంగంలోకి దిగిన టీఎంఆర్‌ఈఐఎస్‌ అధికారులు అశ్వారావుపేట గురుకుల కళాశాలలో విచారణ నిర్వహించారు. ఈ విచారణలో విద్యార్థినులు విస్తుగొల్పే విషయాలను అధికారులకు వివరించారు.
బెదిరించి ఫిర్యాదు చేయించారు..!
వైస్‌ ప్రిన్సిపాల్‌ కవిత తమను ఎప్పుడూ వేధించలేదని, ఎటువంటి ఇబ్బందీ పెట్టలేదని రాతపూర్వకంగా రాసిచ్చారు. విద్యార్ధినుల విచారణను అధికారులు వాయిస్‌ రికార్డు సైతం చేశారు. ఇంగ్లీష్‌ లెక్చరర్‌ స్వప్న, ఫిజిక్స్‌ లెక్చరర్‌ నీరజ ఇద్దరూ తమపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి లెటర్‌ రాయించారని చెప్పారు. తమకు రాయటం రాకపోతే వాళ్లే రాసి దాన్ని చూసి తమ హ్యాండ్‌ రైటింగ్‌తో రాయమని చెప్పారని, లేకపోతే తమను కాలేజీ నుంచి పంపించి వేస్తామని.. ఎగ్జామ్స్‌లో ఫెయిల్‌ చేస్తామని బెదిరించారని విద్యార్దులు అధికారులకు చెప్పారు.
చేసేది లేక వాళ్లు చెప్పిన విధంగా ఫిర్యాదు రాసి ఇచ్చామని చెప్పారు. తాము రాసిన కంప్లయింట్‌ కాపీలను ఇంగ్లీష్‌ లెక్చరర్‌ స్వప్న, ఫిజిక్స్‌ లెక్చరర్‌ నీరజ ఎవరికి పంపారో తమకు తెలియదని విద్యార్ధినులు అధికారుల ఎదుట వాపోయారు. ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌ లెక్చరర్లు తమను ఎలా బెదిరించారో విద్యార్థినులు లిఖితపూర్వకంగా ఖమ్మం ఆర్‌ఎల్‌సీ అరుణకుమారికి అందజేశారు.
మానసిక క్షోభతో తెలుగు లెక్చరర్‌ అనారోగ్యం పాలు..
ఈ ఊహించని పరిణామంతో కళాశాల తెలుగు లెక్చరర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కవిత తీవ్ర భయభ్రాంతులకు గురై అనారోగ్యం పాలయ్యారు. విజయవాడలో ప్రముఖ మానసిక వైద్యులు కవితను పరీక్షించి మానసికంగా కృంగిపోవడంతో బ్రెయిన్‌, మెడ, వెన్నుపూస సంబంధిత భాగాలు దెబ్బతిన్నాయని వివరించారు. ఇప్పుడిప్పుడే ఆమె అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని తెలిపారు.
అన్ని ఆధారాలున్నా చర్యలు తీసుకోని అధికారులు..
ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌ లెక్చరర్లు విద్యార్థినులను పక్కదోవ పట్టించి ఫిర్యాదు చేయించినట్టు అన్ని ఆధారాలున్నా మైనార్టీ సొసైటీ అధికారులు ఇప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ సమయంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఉండటంతో ‘మార్చి 14 వరకు ఆగండి మీకు న్యాయం చేస్తామని’ సొసైటీ అధికారులు కవితకు హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
ఇద్దరు లెక్చరర్‌లను ప్రిన్సిపాల్‌ సంగీత మార్చి 14న రిలీవ్‌ చేసి కళాశాల నుంచి బయటకు పంపించి వేశారు. రిలీవ్‌ చేశాను కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోలేమని ప్రిన్సిపాల్‌ చెప్తుండటాన్ని కవిత తప్పు పట్టారు. ఈ విషయంలో తనకు తగు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.
రిజైన్‌ చేసి వెళ్లారు.. ఇక ఎలాంటి చర్యలు తీసుకోలేము..
– అరుణకుమారి, ఆర్‌ఎల్సీ, ఖమ్మం
ఈ ఘటనకు కారణమైన ఇంగ్లీష్‌ లెక్చరర్‌ ఇప్పటికే రిజైన్‌ చేసి వెళ్లారు. ఫిజిక్స్‌ అధ్యాపకురాలి పాత్ర నామమాత్రంగా ఉన్నట్టు విచారణలో తేలింది. దీనిపై సెక్రెటరీ విచారణ నిర్వహించారు. ప్రధానంగా ఇంగ్లీషు లెక్చరర్‌ మాత్రమే మాపై ఒత్తిడి చేశారని.. ఫిజిక్స్‌ లెక్చరర్‌ ఆ సమయంలో అక్కడ ఉండి.. ఆమెకు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు కానీ మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని విద్యార్థులు చెప్పారు. అయినప్పటికీ ఆమె కూడా రిలీవ్‌ అయినట్టు సమాచారం ఉంది.