వామ్మో..

వామ్మో..– గూడపూర్‌లో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత
– ఈ ఏడాది ఇదే అత్యధికం
– మే మొదటి వారంలోనే 47కు చేరువలో
– సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రోహిణికార్తెకు 24 రోజుల ముందు నుంచే రోకళ్లు పగిలేలా ఎండలు కొడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టి మధ్యాహ్నానానికి తన చండిపచండాన్ని చూపుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెల తొలిరోజే రికార్డు స్థాయిలో నల్లగొండ జిల్లా గూడపూర్‌లో అత్యధికంగా 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది మే 27న 46.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో మే నెలలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే సూచనలున్నాయి. వారం పాటు వడగాల్పులు తీవ్ర స్థాయిలో వీచే అవకాశముందని హెచ్చరించింది. 15 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. ఆ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరించింది.

గూడపూర్‌ (నల్లగొండ) 46.6 డిగ్రీలు
చండూర్‌(నల్లగొండ) 46.5 డిగ్రీలు
ములుగు 46.5 డిగ్రీలు
భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం) 46.5 డిగ్రీలు
మునగాల(సూర్యాపేట) 46.5 డిగ్రీలు
వైరా(ఖమ్మం) 46.5 డిగ్రీలు
ముత్తారం(పెద్దపల్లి) 46.4 డిగ్రీలు
తిమ్మాపూర్‌(నల్లగొండ) 46.4 డిగ్రీలు
ఖానాపూర్‌పీఎస్‌(ఖమ్మం) 46.4 డిగ్రీలు
వెల్గటూరు(జగిత్యాల) 46.4 డిగ్రీలు