నిరాధారం…కల్పితం

నిరాధారం...కల్పితం–  ప్రబీర్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదు
– నిరసనకారులకు డబ్బు పంచలేదు
– విమర్శిస్తే దేశానికి వ్యతిరేకత అంటున్నారు
– ఢిల్లీ పోలీసుల చార్జిషీటుపై ‘న్యూస్‌క్లిక్‌’వివరణ
న్యూఢిల్లీ : పోర్టల్‌ పైన, ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ పైన ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటుకు సంబంధించి మీడియాలో వచ్చిన ఆరోపణలను న్యూస్‌క్లిక్‌ తోసిపుచ్చింది. తన వివరణ తీసుకోకుండానే చార్జిషీటులోని ఆరోపణలను ప్రచురించారని తెలిపింది. దీనిపై న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ ఇచ్చిన వివరణలు… మీడియా విచారణను కోరుకోవడం లేదని మేము ఎప్పటి నుండో చెబుతూనే ఉన్నాము. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలను చర్చించాలని మేము భావించడం లేదు. న్యాయ ప్రక్రియపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే ఆరోపణల తీవ్రత, వాటిని కూడా తరచుగా చేస్తుండడం, అవి పూర్తిగా అసంబద్ధంగా ఉండడం వంటి పరిణామాల దృష్ట్యా మేము కొన్ని విషయాలను ప్రస్తావించాలని అనుకుంటున్నాము.
న్యూస్‌క్లిక్‌ పైన, ప్రబీర్‌ పుర్కాయస్థ పైన చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం. న్యూస్‌క్లిక్‌ కానీ, ప్రబీర్‌ కానీ ఎలాంటి ఉగ్రవాద చర్యకు పాల్పడలేదు. అందుకు తగిన ఆధారమూ లేదు. ప్రబీర్‌కు ఏ ఉగ్రవాద గ్రూపుతోనూ సంబంధాలు లేవు.
అవి విచారణాధికారి ఆరోపణలే
ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం, న్యాయపరమైన ప్రక్రియలను పెండింగులో ఉంచడమే వారి లక్ష్యం. అందుకు అనుగుణంగానే వారు ఈ సమయంలో ఇలాంటి వార్తలు వండి వారుస్తున్నారు. ఏప్రిల్‌ 30వ తేదీనే అభియోగాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం దాఖలు చేసిన చార్జిషీటును ఉద్దేశపూర్వకంగానే లీక్‌ చేశారు. విచారణాధికారి అభిప్రాయాలనే చార్జిషీటులో పొందు పరుస్తారు తప్ప మరేమీ కాదు. వాటినే ఆరోపణలుగా చూపుతారు. వీటిని న్యూస్‌క్లిక్‌, ప్రబీర్‌ దృఢంగా ఎదుర్కొంటారు. అంతా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంది
ప్రబీర్‌కు సీపీఐ (ఎం)తో దీర్ఘకాల అనుబంధం ఉంది. ఆయన గత యాభై సంవత్సరాలుగా ఆ పార్టీలో సభ్యుడు. దీనర్థం ఏమంటే ఆయన ఎప్పుడూ మావోయిస్టులకు కానీ, లష్కరే తోయిబాకు కానీ లేదా హింసాత్మక, చట్టవ్యతిరేక ప్రణాళికలు ఉన్న ఏ ఇతర గ్రూపు, వ్యక్తులకు మద్దతు ఇవ్వలేదు. ఆర్థికంగా లేదా ఇతరత్రా సాయపడలేదు. ఆయన రాజకీయ ప్రమేయం, అభిప్రాయాలు ప్రజాక్షేత్రంలో కన్పిస్తూనే ఉంటాయి.
అనేక మీడియా సంస్థల మాదిరిగానే న్యూస్‌క్లిక్‌ కూడా దేశంలో జరిగే ప్రధాన పరిణామాలను ప్రజలకు అందిస్తుంది. రైతుల నిరసనలు, సీఏఏ-ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు కూడా అందించింది. మా పాత్రికేయుల పనులు పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాయి. వాటిలో రహస్యమేమీ లేదు. న్యూస్‌క్లిక్‌ కానీ, ప్రబీర్‌ కానీ నిరసనకారులకు పంచేందుకు నగదు ఇవ్వలేదు. అల్లర్లను ప్రోత్సహించలేదు. న్యూస్‌క్లిక్‌ తన న్యూస్‌ బులెటిన్లు, వార్తల్లో మ్యాపులకు సంబంధించి అన్ని నిబంధనలను పాటిస్తోంది. అదంతా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంది. కొవిడ్‌ కష్టకాలంలో నిపుణులతో చర్చించి, వారి వ్యాఖ్యలను ప్రచురించింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి న్యూస్‌క్లిక్‌లో వచ్చినదంతా ఆర్టికల్స్‌, వీడియోల రూపంలో పోర్టల్‌లో అందరికీ అందుబాటులోనే ఉంది.
స్వతంత్ర జర్నలిజం లక్ష్యంగా…
మా స్వతంత్ర జర్నలిజంను లక్ష్యంగా చేసుకొని ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థలు విచారణలు చేస్తున్నాయని మేము మరోసారి పునరుద్ఘాటిస్తున్నాము. ప్రభుత్వ విధానాలను విమర్శించినా, నిరసన వార్తలను అందించినా దానిని భారత్‌ వ్యతిరేక చర్యగా చిత్రిస్తున్నారు. మాపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. కల్పితమైనవి. ‘రక్షణ కల్పిస్తున్న సాక్షులు’ ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. వీటిని న్యాయస్థానంలో నిరూపించాల్సి ఉంటుంది. వీటిని కోర్టుల్లో న్యూస్‌క్లిక్‌ తగిన సమయంలో ఎదుర్కొంటుంది. ప్రబీర్‌, న్యూస్‌క్లిక్‌, మా పాత్రికేయుల కృషి యావత్తూ సమర్ధనీయమేనని మేము విశ్వాసంతో ఉన్నాము.