– రాజస్థాన్‌పై హైదరాబాద్ గెలుపు
– రాణించిన నితీశ్, ట్రావిశ్ హెడ్
– హైదరాబాద్ 201/3, రాజస్థాన్ 200/7
ఉప్పల్ థ్రిల్లర్‌లో సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ సాధించింది. ఆఖరు బంతికి 2 పరుగులు అవసరమైన దశలో రాయల్స్ విజయంపై దీమాగా కనిపించినా.. భువనేశ్వర్ కుమార్ (3/41) అద్భుత బంతితో పావెల్ (27)ను బోల్తా కొట్టించాడు. 202 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (76 నాటౌట్), ట్రావిశ్ హెడ్ (58) అర్థ సెంచరీలతో తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్ 201 పరుగులు చేసింది.
నవతెలంగాణ-హైదరాబాద్
వరుస పరాజయాల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ పుంజుకుంది. ఆఖరు బంతి వరకు ఉత్కంఠకు దారితీసిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఒక్క పరుగు తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఛేదనలో రియాన్ పరాగ్ (77, 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (67, 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరిసినా.. సన్‌రైజర్స్ బౌలర్ల మెరుపులతో రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ (3/41), నటరాజన్ (2/35), కమిన్స్ (2/34) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీశ్ కుమార్ రెడ్డి (76 నాటౌట్, 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), ట్రావిశ్ హెడ్ (58, 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సహా హెన్రిచ్ క్లాసెన్ (42 నాటౌట్, 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించటంతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 17లో ఆరో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో రెండో పరాజయం చవిచూసింది.
నితీశ్ కుమార్ అదుర్స్: టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (12, 10 బంతుల్లో 1 సిక్స్) నిరాశపరిచినా.. విధ్వంసక ఓపెనర్ ట్రావిశ్ హెడ్ (58, 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. నం.3 బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ (5, 5 బంతుల్లో 1 ఫోర్) పవర్‌ప్లేలో బ్యాటింగ్‌కు వచ్చినా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. రాజస్థాన్ రాయల్స్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశించిన స్కోరు సాధించలేదు. ఆరు ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 37 పరుగులే చేసింది. మిడిల్ ఓవర్లలో ట్రావిశ్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి (76 నాటౌట్) కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్, నితీశ్ మూడో వికెట్‌కు 57 బంతుల్లో 96 పరుగులు జోడించారు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన ట్రావిశ్ హెడ్.. హైదరాబాద్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 30 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. హెడ్ నిష్క్రమణ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (42 నాటౌట్) అదరగొట్టాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో డెత్ ఓవర్లలో విరుచుకుపడ్డాడు. నితీశ్ కుమార్ సైతం 8 సిక్సర్లు, మూడు ఫోర్లతో మెరుపు ప్రదర్శన చేశాడు. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 201 పరుగులు చేసింది.