
– బీజేపీని గ్రామాలలో తిరగకుండా తరిమికొట్టాలి….
– భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి..
నవతెలంగాణ – మునుగోడు
కార్మికుల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొట్లాడి సాధించుకున్న హక్కులను కాల రాసేందుకు కుట్ర చేస్తున్న మోడీ ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గద్దె దించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ప్రచారం లో భాగంగా ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి మూడోసారి వస్తే దేశాన్ని స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు హోల్ సేల్ గా అమ్మేస్తాడని తెలిపారు . గత పది సంవత్సరాలుగా బీజేపీ కార్మికులు, రైతు, పేదవాళ్లకు వ్యతిరేక విధానాలను అనుసరించడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పౌర హక్కులను కాపాడుకునేందుకు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పినప్పుడే మనుగడ ఉంటుందని అన్నారు. మోడీ మోసపూరిత మాటలతో మత , దేవుళ్ళ సెంటిమెంటు తో ప్రజలను మధ్యపెట్టి మోసగించి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీకి ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఎమర్జెన్సీ తలపించే విధంగా పాలన ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలను విస్మరించి అంకారపూరితంగా పరిపాలన కొనసాగించిందని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన డిమాండ్ చేశారు. పూటకో పార్టీలు మార్చే నాయకులను ఓడించాలని, మునుగోడు నియోజకవర్గ వెనుకబాటుకు కారణం గత పాలకులే కారణమని ఆయన అన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని పాదయాత్రలు, సాగు, త్రాగునీరు కోసం పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం లో ఇండ్ల స్థలాల కోసం, కార్మికుల కోసం, గీత కార్మికుల సమస్యల కోసం, పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడింది కమ్యూనిస్టు లేనని ఆయన అన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా ప్రజా ఉద్యమాలలో ఉండి పోరాడిన తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే నాయకునిగా కాదు సేవకునిగా పనిచేస్తానని అన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలందరికీసీపీఐ(ఎం) చేసిన పోరాటాలు తెలుసునన్నారు. సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించిపెట్టారన్నారు. నేడు ప్రజలు వాటిని అనుభవిస్తురన్నారని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ ఏర్పడిన 2009 ఎన్నికల నుండి సీపీఐ(ఎం) పోటీ చేస్తుందన్నారు. అందుకే నిరంతరం నిజాయితీగా, నికరంగా, అవినీతికి తావులేకుండా ప్రజాసమస్యలపై పోరాడే తమ ను ఆశీర్వదించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య , మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, నారబోయిన నరసింహ, గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.