– కేంద్రానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ గూగుల్, యూట్యూబ్‌లపై బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదును చట్ట ప్రకారం పరిష్కరించాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. గూగుల్, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా బీఆర్‌ఎస్ నేతలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టుగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వానికిపై విధంగా ఉత్తర్వులు జారీ చేసి పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు. బీఆర్‌ఎస్ నేతల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న సమాచారాన్ని గూగుల్, యూట్యూబ్‌ల నుంచి తొలగించాలనీ, లేదంటే ఇతరులకు అందుబాటులో లేకుండా ఆ సంస్థలు నియంత్రించాలని కోరితే.. వీడియోల అప్లోడ్‌పై తమకు నియంత్రణ లేదని ఆ సంస్థలు చెప్పాయంటూ పిటిషనర్ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ఉత్తర్వులు ఉంటేనే చర్యలు తీసుకునేందుకు వీలుందని ఆయా సంస్థలు చెప్పాయన్నారు. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్రానికి ఏప్రిల్ 25న వినతి పత్రం ఇస్తే ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాదనల తర్వాత బీఆర్‌ఎస్ ఇచ్చిన వినతిపత్రంపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.