మాయమాటలు చెప్పిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

మాయమాటలు చెప్పిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి– నాడు ఓటుకు నోటు.. నేడు ఓటుకు ఒట్లు : మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ -చండూరు
నాడు ఓటుకు నోటు అని, నేడు ఓటుకు ఒట్లు లాగా కాంగ్రెస్‌ సర్కారు పాలన ఉందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. భువనగిరి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కొత్త పథకాలు దేవుడు ఎరుగు, ఉన్న పథకాలను ఆగం చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన కేసీఆర్‌పై ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, ఇది ఏం పద్ధతి అని ప్రశ్నించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించి రాష్ట్రానికి సాగు, తాగునీరు, కరెంటు అందించిన కేసీఆర్‌ను అవమానించిన రేవంత్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. 6 గ్యారంటీల బాండ్‌ను బౌన్స్‌ చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్నారు. రుణ మాపీ, 6 గ్యారంటీలను ఆగస్టు 15లోగా అమలు చేయాలని రేవంత్‌కు సవాల్‌ విసిరితే సమాధానం లేదన్నారు. నాడు ఓట్ల కోసం ప్రమిసరీ నోట్లు వాసి ఇచ్చారని, నేడు ఓట్ల కోసం దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వారి అబద్ధాలకు సమర్థించినట్లే అవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిని ఓడించాలన్నారు.ప్రజలకు ఏమీ చేయని బీజేపీ నాయకులు క్యాలెండర్‌లతో తిరుగుతున్నారని విమర్శించారు. బీజేపీ మూలంగానే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొనాలి అంటే నూకలు బుక్కాలన్న వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు