– కులం,మతం పేరుతో బీజేపీ రాజకీయాలు
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– సీతాఫల్ మండి, అడ్డగుట్ట డివిజన్‌ల్లో రోడ్డు షో
నవతెలంగాణ-ఓయూ
”హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. కుల, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నది. ప్రధాని మోడీ పేదోళ్లకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అదానీ, అంబానీలకు రూ.14 వేల కోట్ల రుణమాఫీ చేసిండు” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్‌కు మద్దతుగా శుక్రవారం అడ్డగుట్ట, సీతాఫల్‌మండి డివిజన్‌లలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2014లో బడే భారు మోడీ మస్త్ కథలు చెప్పిండన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని, ప్రతి ఒక్కరికీ ఇల్లు , రైతుల ఆదాయం డబుల్ అని పెద్ద పెద్ద బిల్డప్‌లు ఇచ్చిండన్నారు. ఇప్పుడు నల్లధనం ఏదయ్యా మోడీ అంటే తెల్లమొఖం వేసిండని విమర్శించారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రై ఐదేండ్లయిందని.. ఆయన చేసిందల్లా కుర్ కురే ప్యాకెట్లు పంచుడేనని అన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి ఇయ్యలే, మెట్రోకు పైసా ఇయ్యలే కానీ గుజరాత్‌లో వరదలు వస్తే మాత్రం మోడీ ప్రత్యేక విమానం వేసుకొని పోయి రూ. వెయ్యి కోట్లు ఇచ్చిండని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌కు కిషన్‌రెడ్డి ఏం చేసిండో చెప్పి ఓట్లు అడగాలన్నారు. పెట్రోల్, డీజిల్ మీద రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని, ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టామంటున్నారని, మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నారని ప్రశ్నించారు. రూ.30 లక్షల కోట్లలో రూ.14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేశారని తెలిపారు.