– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేపట్టడం, సెలవుల్లో తరగతులను నిర్వహిస్తున్న 27 ప్రయివేటు జూనియర్ కాలేజీలకు జరిమానా విధించామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. వాటిలో రెజోనెన్స్, వశిష్ట, తపస్య, నారాయణ, అర్బన్ రెసిడెన్షియల్ కాలేజీలున్నాయని వివరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఒక్కో కాలేజీపై రూ.లక్ష వరకు జరిమానా విధించామని అన్నారు. చట్టం పరిధిలో జరిమానా విధించడం వరకే విద్యాశాఖకు అధికారం ఉందని చెప్పారు. అవసరమైతే ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేయొచ్చని అన్నారు. అంతకుమించి చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని వివరించారు. భవిష్యత్తులో నిబంధనలకు విరుద్ధంగా నడిచే కాలేజీలను కట్టడి చేస్తామన్నారు.