కుబేరులను పెంచి పోషిస్తున్న మోడీ 

– సంపన్నుల అభివృద్ధి చూపి దేశం అభివృద్ధిగా ప్రచారం
– ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కుబేర్లను పెంచి పోషిస్తూ పేదవర్గాలపై అపారమైన ఆర్థిక భారాన్ని మోపుతున్నారని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ ఆరోపించారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం సామాజిక న్యాయం సాధించుకుందాం కేంద్రంలో మార్పు కోరుకుందాం అనే రెండు పేజీల కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా కానీ ఏ ఆర్థిక ప్రయోజనం చేసే పథకాలు అందించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య  వినియోగదారులపై డీజిల్, పెట్రోల్, గ్యాస్, జిఎస్టి మొదలకు పన్నులు విధించి 70 లక్షల కోట్లు నిర్ధాక్షిణ్యంగా వసూలు చేస్తుందన్నారు. దేశంలో లక్షల కోట్ల సంపద ,వేలాది కోట్ల రూపాయల సంవత్సర ఆదాయం పొందుతున్న కార్పొరేట్ సంస్థలపై కేవలం 23% కార్పొరేట్ పన్ను,సాధారణ పౌరులపై 30% ఆదాయపన్ను వసూలు చేస్తుందన్నారు.కార్పొరేటీకరణ ద్వారా లక్షల కుటుంబాలు చిరు వ్యాపారం తమ వృత్తులను వ్యాపారాలను కోల్పోయి పేదరికంలోకి నెట్టి వేయబడ్డారాని పేర్కొన్నారు. మోడీ పాలనలో ప్రపంచంలోనే దాదాపు 180 దేశాలలో మన దేశం మానవాభివృద్ధిలో మరింత దిగజారిపోయిందని అన్నారు. ప్రపంచ స్థాయిలో 2014లో 128వ స్థానంలో ఉండగా గత పది సంవత్సరాలలో 136వ స్థానానికి దిగజారిందని తెలియజేశారు. సంపన్నుల అభివృద్ధిని చూపి దేశం అభివృద్ధి అయిందని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక సామాజిక ఆర్థిక కార్యక్రమాలను అమలు చేయించుకోవలసిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులకు ఓటు వేసి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను యువకులను రైతులను మహిళలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో  జేఏసీ వైస్ చైర్మన్ పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ , డాక్టర్ ఎదులాపురం తిరుపతి, డాక్టర్ వంగల సుధాకర్, మేకల వీరన్న యాదవ్, తక్కలపల్లి రాజగోపాల్ రావు, పుల్లూరు సుధాకర్, పొన్నాల ఫ్రాన్సిస్, ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, సిహెచ్ వీరసోమయ్య , అలువోజు రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు.