ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాలల వికాసం కొరకు నిరంతరం పనిచేస్తూ, బాల వికాసకారులు గరిపెల్లి అశోక్ బాటలో నడుస్తున్న వారిలో కవి, రచయిత, ఉపాధ్యాయులు, బాల వికాసకార్యకర్త, కావ్యకర్త కందుకూరి భాస్కర్ ఒకరు. భాస్కర్ మే 5, 1979న నేటి పెద్దపల్లి జిల్లాలోని నంది మేడారం గ్రామంలో పుట్టాడు. తల్లితండ్రులు శ్రీమతి కందుకూరి సత్తమ్మ-శ్రీ చంద్రమౌళి గార్లు. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ., ఎం.కాం., బిఎడ్‌లు చదివి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.
ఇవ్వాళ్ళ బాల సాహిత్యంతో పాటు అన్ని ప్రక్రియలపై విరివిగా సమీక్షలు, వ్యాసాలు రాస్తున్న కందుకూరి భాస్కర్ కవిగా కూడా సుపరిచితులు. బాల వికాస కార్యకర్తగా తాను పనిచేసిన ప్రతిచోట పిల్లల సంకలనాలు, పిల్లల రచనలు సంపుటాలు ప్రచురింపజేసి బాల వికాస యజ్ఞంలో నేను సైతం అంటూ ముందువరుసలో నిలిచాడు. ఉపాధ్యాయునిగా నియామకమై ఉద్యోగం చేసిన మొదటి బడి చెగ్యాంలో పిల్లలతో రచనలు చేయించి చెగ్యాం బడిపిల్లల రచనలను ‘వెలుగు రేఖలు’గా వెలువరించాడు. 2025లో మరో బడికి బదిలీ కాగా ఆ జగదేవ్ పేట పాఠశాల పిల్లల రచనలను ‘చిరుదివ్వెలు’ పేరుతో ప్రచురించాడు. తరువాత పెద్దపల్లి జిల్లాలోని నర్సింహుల పల్లి పాఠశాలకు బదిలీ అయి ఆక్కడి పిల్లల రచనలను ‘పల్లె పరిమళాలు’ కథలుగా తెచ్చారు. అంతేకాదు ఇక్కడి పిల్లల కథలు కెనడా కేంద్రంగా వచ్చే గడుగ్గాయి పత్రికలో ప్రచురింపబడడం వెనుక ఈయన కృషి ఉంది. భాస్కర్ కృషి వల్ల మణికొండ వేదకుమార్ గ్రామీణ పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ‘బాల చెలిమి బాలల గ్రంథాలయం’ నర్సింహుల పల్లిలో నెలకొల్పబడింది.
కవిత్వంలోని పలు లఘు ప్రక్రియలైన మణిపూసలు వంటి వాటిలో కృషిచేసి రచనలు చేశాడు. తన విద్యార్థుల రచనలు పుస్తకాలుగా వచ్చేందుకు తోడ్పాటునందించారు. అలా వెలువడినవే బుర్ర వైష్ణవి రచించిన ‘ఆడపిల్ల’ మణిపూసల శతకం, వేల్పుల శ్రీలత బాలల కథల సంపుటి ‘నిజమైన స్నేహితులు’, పాడేటి సమజ్ఞ రచించిన ‘తెలుసుకో విద్యార్థి’ మణి పూసల శతకం. ఈ కోవలోనే నాగుల శ్రీనిత్య రచించిన పుస్తకం ‘ప్రకృతి ఒడిలో’ సంపుటి. ఈ విద్యార్థులందరి పుస్తకాలకు స్ఫూర్తిగా నిలవడమే కాక రచనల్లో మెళకువలను నేర్పాడు భాస్కర్. నర్సింహులపల్లె బడి పిల్లల ఇరవై ఒక్క కథల సంపుటి ‘పల్లె పరిమళం’కు ఈయనే సంపాదకుడు. బండారు బాలనంద సంఘం ‘గురుబ్రహ్మ పురస్కారం’, డా||చింతోజు బ్రహ్మయ్య- బాలమణి బాలసాహిత్య పురస్కారం’, ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వెల్గటూరు ఉపాధ్యాయ పురస్కారం’ వంటివి భాస్కర్ అందుకున్న పురస్కారాలు, సత్కారాలు.
బాల సాహిత్యకారుడుగా భాస్కర్ తొలి పుస్తకం ‘సిరిమల్లెలు’ పేరుతో బాలల కోసం రాసిన వివిధ ముఖ్య దినోత్సవాల సందర్భంగా పాడుకునే పాటలు. ఇందులోని పాటలన్నీ వివిధ సమయాలు, సందర్భాలు, పండుగలు, పబ్బాల సమయంలో, రూట్ మార్చ్ మొదలు పాఠశాలల్లో జరిగే ఉత్సవాల కోసం రాసినవి. తొలి గీతం ‘తెలంగాణ’. ఇందులో తెలంగాణ వీరులను, అమరులను తలచి పాట రాశాడు భాస్కర్. ‘జై కొట్టు తెలంగాణ బిడ్డ/ కీర్తి పెంచు నీ పురిటి గడ్డ’ అంటూ ఘనమైన, భవ్యమైన తెలంగాణ బంగారు చరితను ఆయన కీర్తిస్తాడు. ఇందులో సర్వాయి పాపన్న, కొమరం భీం మొదలుకుని ఇక్కడి వనరులు, స్థలాలు, కీర్తి, మహత్తును కీర్తిస్తాడు. ఇది జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం కోసం రాసింది. ప్రకృతిని, పర్యావరాణ మహత్తును గురించి రాసిన మరో మంచి పాట ‘ప్రకృతియే లేకుంటె మనమెక్కడ/ ఈ సృష్టికి మూలం ప్రకృతియే కాదా/ వనసంపదనంతా నరికివేస్తూ/ బతకుల బుగ్గిపాలు చేయద్దురా/ జలసంపదనంతా కాలుష్యం చూస్తూ/ నీటిని వృధా చేవద్దురా’ అంటూ పర్యావరన కార్యకర్తగానే కాక ఒక బడి బాధ్యునిగా పిల్లలకు చక్కని నడతను, నడవడికలను తన రచనలతో అందించే ప్రయత్నం చేశాడు. ప్రముఖుల జయంతులు, వర్దంతుల సందర్భాల కోసం కూడా భాస్కర్ బాల గీతాలు రాసాడు. వాటిలో ‘అలుపెరుగని ఉద్యమ పోరాట యోధుడా!’ అంటూ ఆచార్య జయశంకర్ గురించి, ‘తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కాళన్నా’ అంటూ కాళోజీ గురించి, ‘స్వాతంత్య్ర స్వప్నమునే నెవేర్చిన బాపూజీ’ అంటూ జాతిపిత మహాత్మాగాంధీని, ‘మిస్సైల్ మ్యాన్ మీకు సలాం’ అంటూ అబ్దుల్ కలాం గురిచి, ఇంకా శ్రీనివాస రామానుజన్, సావిత్రీబాయి ఫూలే, బాబా సాహెబ్ అంబేద్కర్, సర్ సి.వి. రామన్ వంటి అనేక మంది వీరి పాటల్లో పిల్లలకు అందారు. ‘వందనాలు వందనాలు’ అంటూ బడిలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవం గురించి, ‘చదువు చదువు చదువు/ చదువేరా కంటికి వెలుగు/ చదువు చదువు చదువు/ చదువేరా మన ఇంటికి వెలుగు’ వంటి చక్కని పాటు ఇందులో ఉన్నాయి. ఆకంశంలోని జాబిలి ఇలపైకి వచ్చినట్టుగా ఉందని బతుకమ్మను గురించి రాసిన భాస్కర్ పిల్లల గురించి కూడా చక్కగా రాశాడు: ‘పిల్లలం బడి పిల్లలం/ మీ కంటి వెలుగులం/ మొగ్గలం పసిమొగ్గలం/ విరబూసే సిరిమల్లెలం’ అంటూ పిల్లలను గురించి రాస్తారు. కవిగా, రచయితగా, బాల వికాప కార్యకర్తగా పిల్లలకు నిరంతరం రచనలో మార్గదర్శనం, పాఠాలు చెబుతున్న ఈ ఉపాధ్యాయ కవి బాలల వికాసం కోసం ముందునిలిచి సైనికునిగా పనిచేస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైనికుడు, పెద్దపల్లి కమాన్ మీద ఎగురుతున్న బాలల రచనల జండా!
– డా|| పత్తిపాక మోహన్
9966229548