లక్నో: బహిర్భూమికి వెళ్లిన దళిత బాలికకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో ఆ బాలిక సజీవ దహనమైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలరామ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. హరయా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన దళిత బాలిక (13) శుక్రవారం సాయంత్రం మల విసర్జన కోసం సమీపంలోని పొలాల వద్దకు వెళ్లింది. గంటసేపైనా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక కోసం వెతకగా పొలాల్లో సజీవ దహనం కావడాన్ని చూసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాలిన బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.