నా కొడుకు దళితుడు కాదని ఎలా తేలుస్తారు ?

My son is not Dalit How do you figure it out?– పోలీసులు తప్పుడు ఆరోపణలు చేశారు
– ప్రతి క్లాస్‌లోనూ మొదటి ర్యాంకు సాధించాడు
– ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడనడం దుర్మార్గం
– రోహిత్‌ వేముల మృతికి కారకులను శిక్షించాలి
– అప్పటి వీసీ, బీజేపీ నాయకులకు శిక్ష పడేవరకు పోరాటం :హెచ్‌సీయూ వద్ద విలేకరుల సమావేశంలో రోహిత్‌ తల్లి రాధిక
నవతెలంగాణ-మియాపూర్‌
రోహిత్‌ వేముల మృతికి కారణమైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలి.. నా కొడుకు దళితుడు కాడని పోలీసులు ఎలా తేలుస్తారు..? ఫస్టు క్లాసు విద్యార్థి అయిన రోహిత్‌.. చదువుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసున్నాడని నివేదిక ఇస్తారా..? అంటూ తల్లి రాధిక ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మెయిన్‌ గేటు వద్ద విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోహిత్‌ వేముల జేఆర్‌ఎఫ్‌లో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడని, పీహెచ్‌డీలో జనరల్‌ సీట్‌ సాధించాడని తెలిపారు. రోహిత్‌ ఆత్మహత్యపై శుక్రవారం కోర్టుకు పోలీసులు సమర్పించిన తుది నివేదికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్‌ వేముల మరణంపై బీజేపీకి అనుకూలంగా తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. ‘నేను దళితురాలినని, నా కొడుకు ముమ్మాటికీ దళితుడే’ ఆమె స్పష్టం చేశారు. తన కొడుకు చదువులో ఎప్పుడూ ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ అని, అతను చదువుల ఒత్తిడితో మరణించాడని పోలీసులు నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. తన ఇద్దరు బిడ్డలూ చదువుల్లో జెమ్స్‌ అని చెప్పారు. బీజేపీ నాయకులకు వత్తాసు పలుకుతూ అప్పటి పోలీసులు రిపోర్ట్‌ తయారు చేశారని, 60 పేజీల నివేదికలో రోహిత్‌ దళితుడు కాదని నిరూపించే ందుకే 30 పేజీలను కేటాయించారని విమర్శిం చారు. రోహిత్‌ మరణానికి కారణమైన నాటి వీసీ అప్పారావుకు, బీజేపీ నాయకులకు శిక్ష పడే వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి రోహిత్‌ వేముల మరణంపై మరోసారి దర్యాప్తు చేయాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. తిరిగి దర్యాప్తు జరపనున్నట్టు హామీ ఇచ్చారని వెల్లడించారు. రోహిత్‌ వేముల మరణంపై, కులంపై పోలీసులు ఇచ్చిన నివేదిక ముమ్మాటికీ తప్పుడు నివేదిక అని హెచ్‌సీయూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు అన్నారు. రోహిత్‌ది సంస్థాగత హత్యని, నాటి వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌ కుమార్‌లే రోహిత్‌ వేముల మరణానికి కారణమని ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌ కూడా రోహిత్‌ వేముల నిజమైన దళితుడని ధృవీకరించార ని గుర్తు చేశారు. స్వతంత్ర దర్యాప్తును తాము స్వాగతిస్తున్నామన్నారు.