లౌకిక దేవాలయం కోసం

For a secular templeకూలి పోయిన గోడల మధ్య
నేనూ, ప్రజాస్వామ్యం నివాసముంటున్నాం
నెత్తిన ఆకాశమే పైకప్పు
సముద్రం ఆటుపోట్ల మధ్య
తూట్లు పడ్డ పడవలో మా ఉనికి
ఒకే బోనులో పులిని, మేకను కట్టేసినట్లుంది
ఈదురు గాలులు, వడగాడ్పుల మధ్య
మేం కాపురంలో వున్నాం చీకిపోయిన నూలుపోగులతో
సమాన హక్కుల శాలువా నేయబడుతూనే వుంది
చిరుగులపై అతుకులు, చింపుతూ నేస్తూనే వున్నారు
అతుకుల బొంతగా మార్చే ప్రయత్నం ఆగటం లేదు
శిధిలాల మధ్య మా కాపురం!
దీపం రెపరెపల మధ్య నిండు జీవితాలు
ప్రజాస్వామ్య ఉనికి మినుకు, మినుకు మంటుంది
నిందలు, అపనిందలు వీడి
ఆరోపణ, ప్రత్యారోపణలకు స్వస్తిపలికి
వెలుగు చీకట్ల మద్యైనా సరే రా నేస్తం
మానవ హారంగా ఓ వంతెనను నిర్మిద్దాం
అటునుంచి నువ్వు, ఇటు నుంచి నేను కదిలి
భారతీయ ఆత్మను మన కలయిక చిహ్నంగా
లౌకిక దేవాలయం నిర్మిద్దాం
– హనీఫ్‌, 9247580946