భాషా పండితులకు సమాన పనికి  సమాన వేతనం అందించాలి..

– పీఆర్సి కమిషనర్ శివశంకర్ ను కోరిన ఆర్ యు పి పి టి బృందం: బీఆర్ కే భవన్ లో భేటీ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
నూతన పిఆర్సి లో భాషా పండితులకు న్యాయం చేయాలని, అప్పర్ ప్రైమరీ, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బోధిస్తున్న భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ వేతనం అందించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రధాన కార్యదర్శి గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్, మొహమ్మద్ హమీద్ ఖాన్ లతో కూడిన  బృందం పి ఆర్ సి చైర్మన్ శివ శంకర్ ను కోరారు. పిఆర్సి కమిషన్ పిలుపుమేరకు కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను  ఆర్యుపిపిటి బృందం  హైదరాబాదులోని బిఆర్కె భవన్లో సోమవారం కలిసింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు అబ్దుల్లా మాట్లాడుతూ  ఇప్పటివరకు కేవలం 150  రూపాయల అదనపు వేతనం ఇస్తూ భాషా పండితులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం భాషా పండితులకు వర్తింపజేయాలని ఆయన కోరారు.ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. 44% ఫిట్మెంట్ సిఫారసు చేయాలని,  ఉపాధ్యాయులకు ఇస్తున్న ఆరు ఎర్న్ లీవ్లను 15 కు పెంచాలని, చైల్డ్ కేర్ లీవులను 360 కి పెంచాలని  ఆయన కోరారు. ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం 5-10-20-25 సంవత్సరాలుగా స్థిరీకరించాలని ఆయన కోరారు. నూతన పిఆర్సి భాషా పండితులకు తప్పనిసరిగా న్యాయం చేస్తుందన్న ఆశాభావాన్ని బృందం వ్యక్తం చేశారు. ఆర్ యు పి పి టి బృందం వాదనలను విన్న పిఆర్సి కమిషన్ చైర్మన్, సభ్యులు వివరాలు అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందించారని అబ్దుల్లా తెలిపారు.