ఆర్‌ఆర్‌ఆర్‌ @ ఖమ్మం

– కాంగ్రెస్‌ అభ్యర్థి పక్కా స్థానికుడేనంటున్న చేగొమ్మ వాసులు
– ఖమ్మంలో ఓ రెండు సినిమా థియేటర్లూ వారివే..!
– పేదలకు వేలాది ఎకరాల భూములు దానం-
– ప్రచారంలో దూసుకుపోతున్న రఘురాంరెడ్డి
– మద్దతుగా సీపీఐ(ఎం) విస్తృత ర్యాలీలు, కాంపెయిన్‌
– వియ్యంకుని విజయానికి నేడు సినీహీరో వెంకటేశ్‌ రోడ్డుషో
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి స్థానికతపై ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఆయన్ను స్థానికేతరునిగా చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని… ఆయన స్వస్థలం కూసుమంచి మండలం చేగొమ్మకు చెందిన ప్రముఖ డాక్టర్‌ బల్లికొండ శ్రీదేవి వ్యాఖ్యానించారు. స్వగ్రామంలో మూడువేల ఎకరాల భూములను పేదలకు దానం చేశారని చెప్పుకొచ్చారు. గ్రామంలో స్కూల్‌కు ఇచ్చిన స్థలం కూడా వారిదేనని…స్థానికుడు కాదనే వాళ్లు చరిత్ర తెలుసుకుంటే మంచిదని…ఆర్‌ఆర్‌ఆర్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడకొచ్చారు. సీపీఐ(ఎం), సీపీఐ మద్దతుతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌కు వస్తున్న జనాదరణను చూసే ప్రత్యర్థులు ఇలాంటి విమర్శలు చేస్తున్నారనే మాటను ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే వియ్యంకుని విజయాన్ని కాంక్షిస్తూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ మంగళవారం ఖమ్మంలో రోడ్‌షో నిర్వహిస్తారు. ఇప్పటికే వెంకటేశ్‌ కూతురు ఆశ్రిత ప్రచారంలో ఉంటున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌ పక్కా లోకల్‌…
లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఓటుహక్కున్న భారతీయ పౌరులకు ఉంది. ఆ మాటకొస్తే ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి స్థానికేతరులకే ఎక్కువగా పట్టం కట్టారు. అప్రస్తుతమైన స్థానికత అంశం ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలోచర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ‘నవతెలంగాణ’ ఆయనకు సంబంధించి కొన్ని అంశాలను సేకరించింది. రఘురాంరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి మొదలు ఆయన పిల్లలు ఖమ్మం బోనకల్‌ రోడ్డులోని మిషన్‌ హాస్పిటల్‌లో జన్మించారు. ఖమ్మం కమాన్‌బజార్‌ రావిచెట్టు సమీపంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ స్థలదాత రఘురాంరెడ్డి తాత రాఘవరెడ్డి అనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు. ఈ నేపథ్యంలోనే వీరి గోత్రనామం ‘రామనూళ్ల’తో ప్రతిరోజూ ప్రాత:కాల పూజలు ప్రారంభమవుతాయి. ఇక ఖమ్మంలోని గాంధీచౌక్‌లో ఒకప్పుడు ప్రముఖ థియేటర్‌గా ఉన్న రాఘవ వీరి తాత పేరుతో నెలకొల్పిందే. అలాగే హెడ్‌పోస్టాఫీస్‌ ఎదురుగా ఉన్న మరో థియేటర్‌ శ్రీనివాస సైతం వీరిదే. చేగొమ్మ, ఖమ్మం నుంచే వీరు వ్యాపారాలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో వేలాది ఎకరాల భూములను ప్రజలకు దానం చేసిన చరిత్ర రఘురాంరెడ్డి కుటుంబానిదిగా చెగొమ్మ గ్రామస్తులు చెబుతున్నారు.
నేడు ‘విక్టరీ’ రోడ్‌షో…
ఇప్పటికే రఘురాంరెడ్డి చిన్న వియ్యంకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిస్థాయి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తుండగా…మరో వియ్యంకుడు, దగ్గుబాటి రామానాయుడి కుమారుడు వెంకటేశ్‌ మంగళవారం ఖమ్మంలో రోడ్‌షో నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్థానిక మయూరిసెంటర్‌లో ప్రారంభమయ్యే ఈ విక్టరీ రోడ్‌షో వైరారోడ్డు మీదుగా ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకు కొనసాగుతుంది. అనంతరం రాత్రి 8 గంటలకు కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించే పుర ప్రముఖుల సమ్మేళనంలోనూ వెంకటేష్‌ పాల్గంటారు. ఇప్పటికే వెంకటేశ్‌ కూతురు, రఘురాంరెడ్డి పెద్దకుమారుడు వినాయక్‌రెడ్డి భార్య ఆశ్రిత, పొంగులేటి కుమార్తె సప్నిరెడ్డి, ఆమె భర్త అర్జున్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ మామను గెలిపిస్తే ప్రజలకు జరిగే ఉపయోగాలను వివరిస్తూ ఆత్మీయ సమ్మేళనాలు చేపడుతున్నారు. 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఆర్‌ఆర్‌ఆర్‌ విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం సభలో పాల్గన్నారు. ముగ్గురు మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచార బాధ్యతలను చేపట్టారు. వీరికి తోడుగా ఇండియా కూటమిలో భాగంగా మద్దతు ఇచ్చిన వామపక్షాలు సైతం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లోక్‌సభ నియోజకవర్గం వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
సీపీఐ(ఎం) విస్తృత ప్రచారం…
దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీ ఓటమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా సీపీఐ(ఎం) లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. దీనిలో భాగంగా ఖమ్మం అభ్యర్థి రఘురాంరెడ్డి విజయం కోసం పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. గతనెల 29వ తేదీన ఖమ్మం ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనయ్య జిల్లా మొదలు గ్రామశాఖ సభ్యుల వరకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు నియోజకవర్గవ్యాప్తంగా ఆ రోజు నుంచి ప్రచారం ముమ్మరం చేశారు. ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించి గెలుపు ఆవశ్యకతను వివరిస్తున్నారు. మొత్తమ్మీద రఘురాంరెడ్డి ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది.