ఈవీఎం యంత్రాల కమిషనింగ్‌ పకడ్బందీగా చేపట్టాలి

ఈవీఎం యంత్రాల కమిషనింగ్‌ పకడ్బందీగా చేపట్టాలి– బ్యాలెట్‌ యూనిట్స్‌ పొందికలో జాగ్రత్తలు వహించాలి
– ఖమ్మం పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
– యంత్రాల కమిషనింగ్‌, మాక్‌పోల్‌ పరిశీలన
– మేడిశెట్టివారిపాలెం అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ పరిశీలన
నవతెలంగాణ-సత్తుపల్లి
ఈవీఎం యంత్రాల కమిషనింగ్‌ ప్రక్రియను పకడ్బంధీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కమిషనింగ్‌ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం సత్తుపల్లి వచ్చిన కలెక్టర్‌ గౌతమ్‌ స్థానిక జ్యోతి నిలయం పాఠశాలలో చేపడుతున్న సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌ ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్ల కమిషనింగ్‌ ప్రక్రియ, మాక్‌పోల్‌ పరిశీలించారు. సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి 294 పోలింగ్‌ కేంద్రాల బ్యాలెట్‌ యూనిట్స్‌, కంట్రోల్‌ యూనిట్స్‌, వీవీ ప్యాట్స్‌ కమిషనింగ్‌ను పరిశీలిస్తూ బ్యాలెట్‌ యూనిట్స్‌ పొందికలో జాగ్రత్తలు వహించాలన్నారు. అనంతరం తహసీల్దారు కార్యాలయం, మండల సమాఖ్య, ఉపాధి హామీ భవన్‌లో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. పోస్టల్‌ బ్యాలెట్స్‌ రిజిస్టర్లను పరిశీలించారు. పోలింగ్‌ ప్రక్రియను చేపడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భద్రతపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గౌతమ్‌ ఆదేశించారు. కలెక్టర్‌ వెంట సహాయ కలెక్టర్‌ (శిక్షణ) మిర్నల్‌ శ్రేష్ఠ, సత్తుపల్లి సెగ్మెంట్‌ ఆర్వో ఎల్‌ రాజేందర్‌, ఏసీపీ ఎ రఘు, తహసీల్దారు యోగేశ్వరరావు పాల్గొన్నారు.
కలెక్టర్‌ గౌతమ్‌ అంతరాష్ట్ర పోలీస్‌ చెక్‌పోస్ట్‌ తనిఖీ
సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర పోలీస్‌ చెక్‌పోస్ట్‌ను ఖమ్మం పార్లమెంట్‌ ఆర్వో, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తనిఖీ చేశారు. వాహన తనిఖీ రిజిష్టర్లను పరిశీలించారు. ఇంత వరకు పట్టుకున్న మద్యం, నగదు, ఇతరత్రా వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వాహనాలు, రాజకీయ నాయకుల వాహనాలతో పాటు అన్ని రకాల వాహనాలను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజర్లపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.